US Presidential Election:


అధికారిక ప్రకటన..


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ చేయనున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ సభలు జరిగినా ఈ హింట్ ఇస్తూనే ఉన్నారు ట్రంప్. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఈ సారి ఎన్నికల్లో జో బైడెన్‌తో పోటీ పడనున్నారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. తన పోటీ గురించి అధికారిక ప్రకటన చేసిన ట్రంప్...తన ప్రచారంలో మార్పులు చేయనున్నట్టు చెప్పారు. గతంలో కన్నా ఈ సారి కాస్త విభిన్నంగా క్యాంపెయినింగ్ చేయాలని భావిస్తున్నట్టు వివరించారు. "అమెరికాను ప్రపంచంలోనే గొప్ప దేశంగా నిలబెట్టాలి. అగ్రరాజ్యంగా మళ్లీ వెలిగిపోవాలి" అని అన్నారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఈ ఓటమికి కారణం...ట్రంపేనని అంతా విమర్శించారు. కానీ...అవేవీ పట్టించుకోకుండా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగాలని సిద్ధపడుతున్నారు ట్రంప్. చివరిసారి 2020లో అమెరికాకు అధ్యక్ష ఎన్నికలు జరగ్గా...బైడెన్‌తో పోటీ పడిన ట్రంప్..ఓటమి పాలయ్యారు. అయినా..ఆయన ఓటమిని ఒప్పుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈసారి బైడెన్‌కు ప్రజలు మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదని చాలా ధీమాగా చెబుతున్నారు. లక్షలాది మంది అమెరికన్లను బైడెన్‌ అసహనానికి గురి చేశారని విమర్శిస్తున్నారు. అమెరికాకు ఐడెంటిటీ లేకుండా పోయిందని మండి పడ్డారు. 


గతంలోనే హింట్..


2024లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని ఇటీవలే ఓ సభలో స్పష్టం చేశారు ట్రంప్. ఓ మీటింగ్‌కు హాజరైన ఆయన..."తరవాతి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా" అన్న ప్రశ్నకు "తప్పకుండా చేస్తాను" అని సమాధానిచ్చినట్టు BBC రిపోర్ట్ చేసింది. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ఆయన ఓ ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లసమయం ఉంది. అయితే..ఈలోగా మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎలక్షన్‌లో ప్రస్తుత ప్రభుత్వంపై అక్కడి ప్రజల అభిప్రాయమేంటే కచ్చితంగా తెలుస్తుంది. ఇందులోని ఫలితాలు...అధ్యక్ష ఎన్నికలనూ ప్రభావితం చేస్తాయి. పూర్తిగా అక్కడి రాజకీయాలు మారిపోయేఅవకాశమూ ఉంది. 2020లో జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి ఆరోపించారు. "నేను రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేశాను. మొదటి సారి కంటే రెండోసారి ఎక్కువ మొత్తంలో ఓట్లు సాధించాను. 2020లో జరిగిన ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఏ సిట్టింగ్ అధ్యక్షుడికీ రాని స్థాయిలో నాకు ఓట్లు వచ్చాయి" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశానికి భద్రత కల్పించేందుకు, పురోగతి సాధించేందుకు తాను మరోసారి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. గత అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు 72 మిలియన్ ఓట్లు రాగా...జో బైడెన్‌కు 81 మిలియన్ ఓట్లు వచ్చాయి. 2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో 'ది బిగ్‌ లై' పేరిట సీఎన్‌ఎన్‌ ప్రచారం నిర్వహించిందని ట్రంప్ అన్నారు. దీని వల్ల తనకు ఆ ఎన్నికల్లో నష్టం కలిగిందని ట్రంప్ అన్నారు. 


Also Read: Twitter Subscription Launch: బ్లూటిక్ పెయిడ్ ఫీచర్ మళ్లీ షురూ, ప్రకటించిన ఎలన్ మస్క్