US Same Sex Marriage Bill:


మత సంస్థల మండిపాటు..


అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కీలక బిల్ పాస్ చేసింది. స్వలింగ సంపర్కులు వివాహం చేసుకునేందుకు అనుమతించే బిల్‌కు ఆమోదం తెలిపింది. సేమ్-సెక్స్ మ్యారేజ్‍లపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేయడం, వీటికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపించడం వల్ల త్వరత్వరగా ఈ బిల్‌ను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. హౌజ్‌లో ఈ బిల్‌కు 258 మంది సభ్యులు ఆమోదం తెలపగా..169 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ప్రస్తుతం ఈ బిల్‌ బైడెన్‌కు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. గత నెల సెనేట్‌లో Respect for Marriage Actకు ఆమోదం లభించింది. ఈ నిర్ణయంపై ఎల్‌జీబీటీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే...కొన్ని మత సంస్థలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహం...బైబిల్‌కు వ్యతిరేకంగా అని మండి పడుతున్నారు. 2015లో  Obergefell v. Hodges కేసు విషయంలో సేమ్ సెక్స్ మ్యారేజ్‌కు ఆమోదం లభించింది. అయితే...ఫెడరల్ ప్రభుత్వం దీన్ని అంగీకరించాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలూ ఆమోద ముద్ర వేస్తే కానీ...అది చట్టంగా మారదు.


అయితే...ఇలాంటి వివాహాలను వ్యతిరేకించే మత సంస్థలకు మాత్రం ఈ చట్టం వర్తించదు. ఈ బిల్ పాస్ అవ్వక ముందు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. 1996లో రూపొందించిన Defense of Marriage Act స్వలింగ సంపర్కుల వివాహాన్ని అంగీకరించలేదు. ఇలా పెళ్లి చేసుకున్న వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించకుండా నిబంధన విధించింది...ఈ చట్టం. కొత్త బిల్‌తో ఈ పాత చట్టానికి స్వస్తి పలకక తప్పదు. స్వలింగ సంపర్కులపై జరిగే దాడులను అరికట్టేందుకు ఈ కొత్త బిల్‌ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సమాజంలో వివక్షకు గురవుతున్న వీరి బంధాన్ని లీగల్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని తేల్చి చెబుతోంది. కొందరు స్వలింగ సంపర్కులపై తీవ్రంగా దాడి చేసి హత్య చేస్తున్న సంఘటనలూ వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని ఓ బార్‌లో ఈ వర్గంపై కాల్పులు జరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే...ప్రభుత్వం వేగంగా ఈ బిల్‌ను ఆమోదించింది. 


సింగపూర్‌లోనూ..


ఎన్నో సంవత్సరాల డిబేట్ తరవాత సింగపూర్‌ ఓ కీలక నిర్ణయం  తీసుకుంది. హోమోసెక్సువాలిటీని (Homosexuality) చట్టబద్ధం చేయనుంది. గే సెక్స్‌పై నిషేధం విధించిన 377A చట్టాన్ని రద్దు చేయనుంది. ఇప్పటి నుంచి హోమోసెక్సువాలిటీ లీగల్ కానుంది. ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ( Lee Hsien Loong) వేదికగా ఈ ప్రకటన చేశారు. భారత్, థాయ్‌లాండ్, తైవాన్ తరవాత LGBT హక్కులపై ఈ  తరహా నిర్ణయం తీసుకున్న దేశంగా  రికార్డుకెక్కింది సింగపూర్. ఈ నిర్ణయంపై సింగపూర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే...హోమోసెక్సువాలిటీని "లీగల్‌"గా పరిగణించినా...పెళ్లి విషయంలో మాత్రం నిషేధం కొనసాగనుంది. మహిళ, పురుషుడు మాత్రమే వివాహ బంధంతో ఒకటి కావాలని...ఒకే జెండర్‌కు చెందిన వాళ్లు వివాహం చేసుకోవాలన్న అంశంపై సింగపూర్‌ వాసులు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అంటే.. గే మ్యారేజ్‌లు (Gay Marriage) మాత్రం కుదరవు.


Also Read: Iran Hijab Protest: మహిళల మర్మాంగాలపై కాల్పులు, ఇరాన్ భద్రతా దళాల అరాచకం