Layoffs News:



2 నిముషాల్లో లేఆఫ్‌లు..


ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది నుంచి మొదలైన ఈ కోతలు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.  రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాయి సంస్థలు. కాస్ట్‌ కట్టింగ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని చెబుతున్నాయి. ఇటీవల ఓ కంపెనీ వీడియో కాల్‌ మాట్లాడుతుండగానే లేఆఫ్‌లు ప్రకటించింది. కేవలం 2 నిముషాల్లోనే అంతా జరిగిపోయింది. రెగ్యులర్ మీటింగ్‌లా అటెండ్‌ అయిన ఆ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కంపెనీ. ఒకేసారి 200 మంది ఉద్యోగులను తొలగించింది.  TechCrunch  వెల్లడించిన వివరాల ప్రకారం Frontdesk కంపెనీ ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ వర్కర్స్‌తో పాటు కాంట్రాక్టర్‌లనూ ఇంటికి పంపేసింది. గూగుల్‌ మీట్‌ కాల్‌లోనే అందరికీ గుడ్‌ బై చెప్పింది. ఉన్నదే 200 మంది ఉద్యోగులు. వాళ్లందరినీ ఒకేసారి తీసేయడమే సంచలనమైంది. స్వయంగా సీఈవో కాల్‌లోకి వచ్చి షాక్ ఇచ్చాడు. అయితే...ఎందుకీ నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం చెప్పలేదు. మరో రెండు వారాల్లో ప్రత్యామ్నాయం వెతుక్కోవాలని స్పష్టం చేసింది. 2017లో మొదలైన Frontdesk కంపెనీ చాలా వేగంగా పుంజుకుంది. దాదాపు 26 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబట్టుకోగలిగింది. 


ఎన్నో సమస్యలు..


అయితే...ఈ ఫండ్స్‌ని రాబట్టుకునేందుకు అనుసరించిన విధానాలు బెడిసికొట్టినట్టు సమాచారం. ఇదే కంపెనీని పీకల్లోతు కష్టాల్లో ముంచేసిందని తెలుస్తోంది. రెండు నెలల క్రితం వరకూ లేఆఫ్‌ల సంకేతాలు ఇవ్వలేదు కంపెనీ. అంతా బానే ఉందనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేల్చింది. ఈ మధ్య కాలంలో చాలా సవాళ్లు ఎదురయ్యాయని, వాటిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది ఈ ఒక్క కంపెనీ సమస్యే కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఇలానే ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కారణం చెప్పకుండానే పంపేస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకుంటోంది. మెటా, గూగుల్ సహా మిగతా బడా సంస్థలన్నీ దశల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. 


గతేడాది మైక్రోసాఫ్ట్‌ కూడా..


మైక్రోసాఫ్ట్‌ కంపెనీ గతేడాది జులైలో ఉద్యోగులకు మరోసారి షాక్ ఇచ్చింది. ఇప్పటికే విడతల వారీగా లేఆఫ్‌లు కొనసాగిస్తున్న సంస్థ...ఇప్పుడు మరో వెయ్యి మందిని తొలగించింది. గత వారం రోజుల్లో 1000 మందిని ఇంటికి పంపింది. 2022లో పదివేల మందిని తొలగిస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. ఈ సారి సేల్స్ అండ్ కస్టమర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లోని ఉద్యోగులను తొలగించింది. వీటితో పాటు ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజర్‌లు, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌కి చెందిన ఉద్యోగులనూ తొలగించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్ కంపెనీ Digital Sales and Success గ్రూప్‌ని మూసేసింది. సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ టీమ్‌ని కూడా తొలగించింది. కస్టమర్ సొల్యూషన్ మేనేజర్ రోల్‌నీ తీసేసింది. కొంత మంది ఉద్యోగులను కస్టమర్ సక్సెస్ అకౌంట్ మేనేజ్‌మెంట్ విభాగానికి తరలించింది. కస్టమర్ సర్వీస్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సంస్థ వెల్లడించింది. అయితే...మేనేజర్ స్థాయి వ్యక్తులకు కూడా ఈ లేఆఫ్‌ల గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదు కంపెనీ. ఫైర్ చేసిన రోజు మాత్రమే లేఆఫ్‌లు కొనసాగుతున్నాయని వాళ్లకు అర్థమవుతోంది. వర్క్‌ఫోర్స్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా ఉద్యోగులను తొలగించక తప్పడంలేదని గతంలో కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 


Also Read: 13 వేల అడుగుల ఎత్తులో జై శ్రీరామ్ జెండా,అయోధ్య ఉత్సవానికి మద్దతుగా స్కైడైవింగ్ - గూస్‌బంప్స్ వీడియో