Puja Khedkar Case: పుణే IAS ట్రైనీ పూజా ఖేడ్కర్‌పై యూపీఎస్‌సీ చర్యలకు సిద్ధమైంది. ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. తప్పుడు ఐడెంటిటీలు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆమె అపాయింట్‌మెంట్‌నీ రద్దు చేయనుంది. మోసం చేసినందుకు కేసు కూడా నమోదు చేసింది. రిక్రూట్‌మెంట్ సమయంలో తనకు మానసికంగా, శారీరకంగా వైకల్యం ఉందని చెప్పి ఆ కోటాలో సెలెక్ట్ అయింది. అంతే కాదు. తన తల్లిదండ్రుల పేర్లనీ తారుమారు చేసింది. సివిల్ సర్వీస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యేందుకు ఇలా అధికారులనే బోల్తా కొట్టించింది. వెంటనే పూజా ఖేడ్కర్‌పై చర్యలు తీసుకోవాలని UPSC నోటీసులు జారీ చేసింది. కేసు పెట్టడంతో పాటు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. పూజా ఖేడ్కర్ ఇచ్చే రిప్లై ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భవిష్యత్‌లోనూ యూపీఎస్‌సీ రాయకుండా నిషేధం విధించింది.
"UPSC నిబంధనలకు కట్టుబడి ఉంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకునే బాధ్యత మాకుంది. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కచ్చితంగా కాపాడుకుంటాం. ఏ తప్పు జరిగినా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం"
- యూపీఎస్‌సీ
ఇప్పటికే ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఓ నివేదిక తయారు చేసి కేంద్రానికి అందించింది. తాను OBC అని చెప్పడంతో పాటు అంగవైకల్యం ఉందంటూ ఆమె ఇచ్చిన ప్రూఫ్‌లన్నింటినీ ఈ రిపోర్ట్‌లో జత చేసింది. పోస్టింగ్ వచ్చిన వెంటనే అందరిపైనా జులుం చెలాయించాలని చూడడాన్నీ ఇందులో ప్రస్తావించింది. పుణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పోస్టింగ్ వచ్చింది. కానీ ఆమె ఆ హోదాకి మించి సౌకర్యాలు కోరుకుంది. ప్రత్యేకంగా కారు, ఇల్లు కావాలని పట్టుబట్టింది. అంతే కాదు. ప్రైవేట్ ఆడీ కార్‌కి సైరెన్ పెట్టించుకుంది. VIP బోర్డ్‌నీ పెట్టింది. ఇదంతా చూసిన అధికారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం బయటకు వచ్చాక మొత్తం ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ మొదలైంది. రిక్రూట్‌మెంట్‌లోనూ మభ్యపెట్టిందని తేలింది. తప్పుడు ఐడెంటిటీతో ఎగ్జామ్ క్లియర్ చేసిందని స్పష్టమైంది. అసలు ఆ ఫేక్ సర్టిఫికేట్స్ ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయన్న చర్చ జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన మెడికల్ టెస్ట్‌లూ చేయించుకోకుండా తప్పించుకుంది. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు నిజమయ్యాయి.
పూజా ఖేడ్కర్ తల్లి కూడా ఓ కేసులో అరెస్ట్ అయింది. రైతుల భూమి కబ్జా చేసింది కాక వాళ్లను గన్‌తో బెదిరించింది. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. ఓ సారి పుణేలో మెట్రో అధికారులతోనూ గొడవ పడిన వీడియో బయటకు వచ్చింది.
Also Read: Ratna Bhandar: రత్న భాండాగారంలో రహస్య సొరంగం! అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో సర్వే చేపడుతున్న ASI