Ratna Bhandar Puri Temple: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న పూరీ రత్న భాండాగారం (Puri Jagannath Temple) వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులోని రహస్య గదిలో మూడు బాక్స్‌లు కనిపించాయి. అందులో స్వామివారి ఆభరణాలు గుర్తించారు. వీటితో పాటు నాలుగు భారీ అల్మారాలూ ఉన్నాయి. అయితే...అందులో ఎన్ని ఆభరణాలున్నాయన్నది మాత్రం ఇప్పుడే వెల్లడించలేదు అధికారులు. వాటిని మరో గదికి సురక్షితంగా తరలించారు. లోపల ఉన్న సంపదకు ఎలాంటి నష్టం కలగలేదని, అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ASI లోపల మరమ్మతుల పనులు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. లోపల ఓ రహస్య సొరంగం ఉందని ఎన్నో ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైనా పూర్తి స్థాయిలో ASI అధికారులు సర్వే చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గుట్టు తేల్చాలని చూస్తున్నారు. అందుకోసం అడ్వాన్స్‌డ్ లేజర్ స్కానింగ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. పూర్తిస్థాయిలో విచారణ పూర్తైన తరవాత లోపలి గదులను ASIకి పూర్తగా అప్పగించనుంది ఆలయ యాజమాన్యం. 


అయితే...ఒడిశా హైకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ బిశ్వంత్ రథ్‌ నేతృత్వంలోని బృందం ఓ ఛాంబర్‌లో దాదాపు 7 గంటల పాటు సర్వే చేపట్టారు. స్థానికుల విశ్వాసాన్ని గౌరవిస్తూ సర్వే నిర్వహించారు. ఆ సమయంలో ఎక్కడా సొరంగం లాంటి నిర్మాణం ఎక్కడా కనిపించలేదని తేలింది. వదంతులు నమ్మొద్దని జస్టిస్ బిశ్వంత్ రథ్ తేల్చి చెప్పారు. ఆలయ కమిటీ సభ్యుడు కూడా ఇదే విషయం వెల్లడించారు. 1978లో పూరీ ఆలయంలోని రత్న భాండాగారాన్ని తెరిచారు. ఆ తరవాత 2018లో తెరిచేందుకు ప్రయత్నించినా కొన్ని అవాంతరాల వల్ల అది సాధ్యం కాలేదు. దాదాపు 46 ఏళ్ల తరవాత ఇన్నాళ్లకు ఈ తలుపు తెరిచారు. లోపల రెండు గదులున్నాయి. ముందు మొదటి గది తలుపులు తెరిచిన అధికారులు సర్వే చేపట్టారు. ఆ తరవాత మరో గది తలుపులు కూడా తెరిచారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో సర్వే కొనసాగుతోంది. ASI ఈ సర్వేని పరిశీలిస్తోంది. 


ఈ భాండాగారం చుట్టూ ఎన్నో వదంతులు, కథలు అల్లుకున్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ఛేదించాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. అంతకు ముందు ప్రభుత్వం మూసేసిన ఆలయ ద్వారాలను తెరిపించింది. ఆ తరవాత వెంటనే రత్న భాండాగారం మిస్టరీని బయట పెట్టాలని నిర్ణయించుకుంది. పైగా అందులో మరమ్మతులు చేయాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులతో సంప్రదింపులు జరిపి SOP కి అనుగుణంగా ఈ తలుపులు తెరిపించింది. అందులోని సంపదనంతా వేరే చోటకు తరలించి మరమ్మతులు చేపడుతోంది. 46 ఏళ్ల క్రితం భాండాగారాన్ని తెరిచినప్పుడు దాదాపు 70 రోజుల పాటు సంపదను లెక్కించారు. ఇప్పుడు ఎన్ని రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నది ఇంకా స్పష్టత లేదు. దీనిపై అధికారికంగా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. 


 Also Read: Microsoft Outage: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతికత సమస్య, ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమానాలు