TMC Leader on President:
వెంటనే తొలగించాలి: అర్జున్ ముండా
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై తృణమూల్ కాంగ్రెస్ మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా ఖండించారు. మమతా బెనర్జీ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే ఆ మంత్రిని క్యాబినెట్‌ను తొలగించి దేశ ప్రజల ముందు క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల కారణంగా అంతర్జాతీయంగానూ భారత్‌పై మచ్చ పడుతుందని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదివాసులను ఇలా అవమానిస్తూనే ఉంటుందనటానికి ఇదో ఉదాహరణ అని విమర్శించారు. "పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఓ మహిళ. ఆమె క్యాబినెట్‌లోని మంత్రి గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతిని కించపరిచారు. భారత్‌కు ఉన్న అంతర్జాతీయ గుర్తింపుని ఇలాంటి వ్యాఖ్యలు తుడిచిపెట్టేస్తాయి" అని స్పష్టం చేశారు అర్జున్ ముండా. ఆ మంత్రిని సస్పెండ్ చేసేంత వరకూ ఊరుకోం అని వెల్లడించారు.
అఖిల్ గిరి వివరణ..
ఈ వివాదంపై అఖిల్ గిరి వివరణ ఇచ్చారు. "నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నాను. నేను రాష్ట్రపతిని గౌరవిస్తాను. సువేందు అధికారిని విమర్శించేందుకు మాత్రమే నేను రాష్ట్రపతి పేరుని ప్రస్తావించాను. సువేందు అధికారి గతంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను చూడటానికి బాగుండనని అన్నారు. నేనో మంత్రిని. రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేసి ఈ పదవిని చేపట్టాను. నాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా..అది రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది" అని అన్నారు అఖిల్ గిరి. ఈ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. టీఎమ్‌సీ ప్రతినిధి సాకేత్ గోఖలే వివరణ ఇచ్చారు. "మంత్రి అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇది కచ్చితంగా బాధ్యతారాహిత్యమే. తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయాలతో ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. భారత రాష్ట్రపతి పట్ల మాకు ఎనలేని గౌరవం ఉంది" అని వెల్లడించారు. టీఎమ్‌సీ ఎంపీ సుస్మితా దేవ్ కూడా దీనిపై స్పందించారు. అఖిల్ గిరి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని మండి పడ్డారు. "ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా దురదృష్టకరం. ఈ కామెంట్స్‌తో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలనే వైఖరికి మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం" అని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు.
Also Read: Gujarat Congress Manifesto: మేనిఫెస్టో విడుదల చేసిన గుజరాత్ కాంగ్రెస్, మిషన్ 124 ఫలిస్తుందా?