Bhupender Yadav on Rahul Gandhi:
భూపేందర్ యాదవ్ అసహనం..
యూకేలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గలేదు. పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ బీజేపీ పట్టు పడుతోంది. కాంగ్రెస్ మాత్రం ససేమిరా అంటోంది. రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నిస్తోంది. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ బడ్జెట్ సమావేశాల్లో రాహుల్‌పై మండి పడ్డారు. సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు మొదలైన గొడవ ఇంకా కొనసాగుతూనే ఉంది. క్షమాపణలు చెప్పాలంటే ముందు మమ్మల్ని మాట్లాడనివ్వాలిగా అంటూ రాహుల్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్ స్పందించారు. "దొంగ" అని ఓ వర్గం మొత్తానికి ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలు సరికాదని మండి పడ్డారు. "దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకుంటుంది" అని రాహుల్ చేసిన కామెంట్స్‌పై అసహనం వ్యక్తం చేశారు భూపేందర్ యాదవ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఓ వర్గాన్ని కించపరిచి మాట్లాడడమే కాకుండా...క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తే నిరసనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "విమర్శించడానికి కించపరచడానికి చాలా తేడా ఉంది. రాహుల్ ఓ వర్గం మొత్తాన్ని అవమానించారు" అని అన్నారు. ఇప్పటి వరకూ ఏ జాతీయ నేత కూడా ఇలా ఓ కమ్యూనిటీని కించపరుస్తూ మాట్లాడింది లేదని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు వర్గాల మధ్య చిచ్చు పెడతాయని అన్నారు. అందరూ గౌరవంగా బతికే హక్కుని రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు. రాహుల్ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని వెల్లడించారు.
రాహుల్‌ను దోషిగా తేల్చిన కోర్టు..
పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారంటూ ఓ బీజేపీ ఎమ్మెల్యే పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీనిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్విటర్‌లో యుద్ధం నడుస్తోంది. జైలు శిక్ష విధించిన వెంటనే బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే..తరవాత రాహుల్ పరిస్థితేంటి అన్నదే ఆసక్తికరంగా మారింది. 30 రోజుల బెయిల్ మాత్రమే మంజూరు చేసింది సూరత్ కోర్టు. ఈ కారణంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయ్యే ప్రమాదముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బెయిల్ ఇచ్చినప్పటికీ ఆయనపై అనర్హతా వేటు పడే అవకాశముందని అంటున్నారు. ప్రజాప్రతినిధుల చట్టం 1951 లోని సెక్షన్ 8 (3) ప్రకారం...ఎవరైనా పార్లమెంట్ సభ్యుడు లేదా సభ్యురాలు ఏదైనా నేరంలో దోషిగా తేలినా, కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడినా ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. ఈ కోర్టు తీర్పు ఆధారంగా...లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌పై చర్యలు తీసుకునే అవకాశమూ ఉంది. ఆయనపై అనర్హతా వేటు వేసే ఆస్కారముంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలూ ఉన్నాయి. అయితే...ఈ తీర్పుపై న్యాయ పోరాటం కొనసాగించేందుకు రెడీ అవుతోంది కాంగ్రెస్.
Also Read: దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం