Jack Dorsey’s wealth: అమెరికన్‌ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌, తన కొత్త నివేదికతో అమెరికన్ మార్కెట్లో భయాందోళనలు సృష్టించింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు 'జాక్ డోర్సే' (Jack Dorsey) స్థాపించిన కంపెనీ 'బ్లాక్‌' (Block) మీద ఈసారి బ్లాస్టింగ్‌ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. తప్పుడు లెక్కలతో అమెరికన్‌ గవర్నమెంట్‌ను బ్లాక్‌ కంపెనీ మోసం చేసిందని ఆ నివేదికలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పేర్కొంది. పెట్టుబడిదార్లను కూడా తప్పుదోవ పట్టించిందని ఆరోపించింది.


11% నష్టపోయిన జాక్ డోర్సే       
హిండెన్‌బర్గ్ వివాదాస్పద నివేదిక తర్వాత బ్లాక్‌ కంపెనీ షేరు ధర గురువారం (23 మార్చి 2023) 20% క్షీణించింది. ఫలితంగా, జాక్ డోర్సే సంపద కూడా వేగంగా తగ్గింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, డోర్సే సంపద గురువారం నాడు 526 మిలియన్‌ డాలర్లు లేదా 11 శాతం తగ్గింది. ఇప్పుడు డోర్సే సంపద 4.4 బిలియన్‌ డాలర్లకు దిగి వచ్చింది. మే నెల తర్వాత ఇది అతి పెద్ద ఒక రోజు క్షీణత.


పేమెంట్స్‌ విషయంలో బ్లాక్ మోసం చేసిందని హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ తన కొత్త నివేదికలో పేర్కొంది. కంపెనీ గణాంకాల్లో అతిశయోక్తి పద్ధతిని అవలంబించారని, వాస్తవ ఖాతాదార్ల సంఖ్య కన్నా ఎక్కువగా సంఖ్యను చూపుతూ షేరు విలువను కృత్రిమంగా పెంచారని ఆరోపించింది. తద్వారా, అటు పెట్టుబడిదార్లను, ఇటు ప్రభుత్వాన్ని మోసగించారని విమర్శించింది. బ్లాక్‌ వ్యవస్థాపకులు కరోనా సమయంలో సుమారు 100 కోట్ల డాలర్‌ విలువైన షేర్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ సంస్థ ఖాతాల్లో 40 నుంచి 75 శాతం వరకు నకిలీవని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు తమతో చెప్పినట్లు హిండెన్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది. ఖాతాదార్లలో ఎక్కువ మంది నేరస్థులు, అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారు ఉన్నారని వెల్లడించింది. కంపెనీ ఆదాయం లెక్కలు కూడా తప్పులతడకగా హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది.      


వ్యాపారులు &ప్రజల కోసం చెల్లింపులు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అందించే వ్యాపారాన్ని బ్లాక్‌ కంపెనీ చేస్తోంది.         


రెండేళ్ల పాటు సాగిన పరిశోధన         
బ్లాక్ కంపెనీ చేస్తున్న వ్యాపారంపై రెండు సంవత్సరాల పాటు పరిశోధన చేశామని, తమ పరిశోధనలో తేలిన విషయాలతో ఈ నివేదికను రూపొందించినట్లు హిండెన్‌బర్గ్‌ తెలిపింది. బ్లాక్ వ్యాపారం ఉద్దేశం 'ఆవిష్కరణ' కాదని;  ఆ పేరిట వినియోగదార్లను, ప్రభుత్వాన్ని సులభంంగా మోసం చేయడం, కంపెనీపై నియంత్రణను నివారించడానికి, భారీ వడ్డీ రేట్లకు రుణాలు, భారీ మోత్తం రుసుములను విప్లవాత్మక సాంకేతికతగా చూపించడం బ్లాక్‌ వ్యాపారం వెనుకున్న అసలు ఉద్దేశంగా హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది.


హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలన్నింటినీ జాక్ డోర్సే కంపెనీ ఖండించింది. హిండెన్‌బర్గ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.        


ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ గ్రూప్‌ మీద కూడా 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ తర్వాత, అదానీ సంపద దాదాపు $150 బిలియన్ల నుంచి $50 బిలియన్ల దిగువకు పడిపోయింది.