అసెంబ్లీ ఎన్నికలు అనగానే కొందరు నేతలకు టికెట్లు రాగా, తమకు ఛాన్స్ ఇవ్వలేదని రెబల్ అభ్యర్థుగా పోటీ చేసే నేతలు ఉంటారు. వారి వల్లే పార్టీ విజయావకాశాలు దెబ్బతింటాయని భావించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొత్త టెక్నిక్ కనిపెట్టారు. త్వరలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ అధిష్టానం మొత్తం 182 స్థానాలకు గానూ 160 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టికెట్ దక్కని అసంతృప్త బీజేపీ నేతలు తమకు టికెట్ ఇవ్వడకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. 


27 ఏళ్లుగా బీజేపీదే హవా..
గుజరాత్ రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో రెబల్ బీజేపీ నేతలను శాంతింపచేయాలని, వారు ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీ మెజార్టీతో పాటు విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై ఫోకస్ చేశారు. ఇదివరకే 160 మందికి టికెట్లు ప్రకటించగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 38 మందికి ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. రెబల్ నేతలను ప్రేమ, అప్యాయతతో మాట్లాడి బుజ్జగించాలంటూ కొత్త రాగం అందుకున్నారు హోం మంత్రి అమిత్ షా. గాంధీనగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బీజేపీ తిరుగుబాటు నేతలు నిరసన తెలిపిన మరుసటి రోజు అమిత్ షా ఈ పద్ధతిని సూచించారు. రెబల్ లీడర్స్ తో ప్రేమగా మాట్లాడి, చర్చల ద్వారా వారిని బుజ్జగించేందుకు కొందరు నేతల్ని సైతం ఏర్పాటు చేసినట్లు పార్టీకి చెందిన ఓ నేత తెలిపారు. 


కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. టికెట్ ఆశించి నిరాశ చెందిన నేతలు, టికెట్ లభించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు ప్యానెల్ ను ఏర్పాటు చేశామన్నారు. నిరసన తెలిపిన నేతలతో ప్రేమగా, శాంతియుతంగా చర్చలు జరుపుతామని, ఎందుకంటే వారు కూడా బీజేపీ కుటుంబ సభ్యులేనని చెప్పారు. అమిత్ షా దాదాపు 5 గంటలపాటూ గుజరాత్ బీజేపీ నేతలతో చర్చలు జరిపి, త్వరలోనే పరిస్థితి చక్కదిద్దాలని సూచించారు. ఇందుకోసం కొందరు నేతలకు బాధ్యతలు అప్పగించారు.


ఎన్నికల షెడ్యూల్


ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరపనున్నట్లు ఈసీ ప్రకటించింది. గుజరాత్ శాసనసభ పదవీకాలం 2023, ఫిబ్రవరి 18తో ముగియనుంది.


డిసెంబర్ 1న గుజరాత్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 5న రెండో విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్, ఫలితాలు వెల్లడించనుంది.


2017లో


గుజరాత్‌లో ప్రస్తుతం భాజపా ప్రభుత్వం అధికారంలో ఉంది. గుజరాత్‌లో 182 శాసనసభ స్థానాలుండగా.. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 99 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 77 స్థానాలు సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో పలుమార్లు ఉప ఎన్నికలు జరగడంతో ప్రస్తుతం కాషాయ పార్టీ బలం 111కు పెరిగింది.