IPL Retention 2023: మూడేళ్లు వరుసగా నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును పునర్ నిర్మించే పనిలో పడింది. కొన్నేళ్లుగా అట్టిపెట్టుకున్న ఆటగాళ్లను వదిలేసింది. గతేడాది డేవిడ్ వార్నర్‌ను తప్పించిన హైదరాబాద్ ఈసారి మరో కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను పక్కన పెట్టేసింది. బౌలింగ్ కోర్ టీమ్‌ను మాత్రం అలాగే ఉంచుకుంది. అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ వంటి కుర్రాళ్లను అట్టిపెట్టుకుంది. నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్‌ను వదిలేసింది.
విడుదల చేసిన ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, నికోలస్ పూరన్, జగదీష సుచిత్, ప్రియమ్ గార్గ్, రవికుమార్ సమర్థ, రొమారియో షెపర్ట్, సౌరభ్ దూబె, సేన్ అబాట్, శశాంక్ సింగ్, శ్రేయస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు: అబ్దుల్ సమద్, అయిడెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మార్కో జన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్ హక్ ఫరూఖి, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
మిగిలిన డబ్బు: రూ.42.25 కోట్లు
ఖాళీగా ఉన్న విదేశీయుల స్లాట్స్ -4
కెప్టెన్ ఎవరు?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇప్పటికీ చాలా తలనొప్పులు ఉన్నాయి. కేన్‌ను పంపించేయడంతో కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో తెలియదు. బహుశా వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మకు అవకాశం దక్కొచ్చు. టీఎన్‌పీఎల్, భారత్-ఏ జట్లకు నాయకత్వం వహించిన అనుభవం సుందర్‌కు ఉంది. దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు అభిషేకే సారథి. పైగా బ్యాటింగ్ మెంటార్ బ్రయన్ లారాతో చక్కని అనుబంధం ఉంది. యువరాజ్ సింగ్ అతడికి వ్యక్తిగత మెంటార్‌గా ఉన్నాడు. నలుగురు విదేశీయులను ఎంపిక చేసుకోవడం కత్తిమీద సామే. బౌలింగ్‌లో యువకులనే నమ్ముకున్నారు. జన్‌సెన్, కార్తీక్, భువి, నటరాజ్, ఉమ్రాన్ వేగం, బౌన్స్, స్వింగ్ వేరియేషన్స్ తెలిసిందే. సుందర్‌కు తోడుగా స్పిన్నర్లను ఎంచుకోవాలి. మార్‌క్రమ్ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా ఉంటాడు. బ్యాటింగ్‌లో త్రిపాఠి, మార్‌క్రమ్ ప్రామినెంట్‌గా ఉన్నారు. బహుశా మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగిస్తారనీ అంచనాలు ఉన్నాయి.