Telugu CMs Meeting : తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో నలుగుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై కేంద్రం చర్చలు ప్రారంభించనుంది. చర్చల్లో బనకచర్ల అంశం ఉండాల్సిన అవసరమే లేదని తెలంగాణ చెబుతోంది. అజెండాలో బనకరచ్ల విషయం ఉంటే చర్చలకు దూరమయ్యే అవకాశం కానుంది.
కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి సమావేశంకానున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచి తేలకుండా అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టు, జల పంచాయితీలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కేంద్రం పూనుకుంది. ఈ మేరకు మీటింగ్ పెట్టినట్టు జలశక్తిశాఖ రెండు రాష్ట్రాల సీఎస్‌లకు ఇప్పటికే సమాచారం పంపించింది.
జలశక్తిశాఖ సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్‌లు, జలవనరుల శాఖాధికారులతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు రేవంత్ రెడ్డి జలశక్తి మంత్రి పాటిల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రాల తరఫున తమ వాదనలు వినిపించారు. ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలతో శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు భేటీ జరగనుంది.
రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర రాజకీయ వివాదానికి కారణమైన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు ఇతర అంశాలపై చర్చలు జరపబోతున్నారు. ఐదు రోజుల క్రితమే ఈ సమావేశం జరగాల్సి ఉంది కానీ ముఖ్యమంత్రుల నుంచి ఆమోదం రాకపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు అంగీకారం తెలపడంతో నేడు భేటీకి మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జలాలపై సమస్యలు ఏర్పడినప్పుడు ఎపెక్స్ కౌన్సిల్‌లో చర్చలు జరపాలి. దీనికి కేంద్ర జల శక్తి మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు.
ఇలాంటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో గతంలో రెండుసార్లు జరిగింది. వాటి వల్ల పెద్దగా అవుట్‌పుట్ రాలేదు. ఇప్పుడు జరుగుతున్నది మూడో సమావేశం. ఇప్పుడు బనకచర్ల ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్న వేళ కేంద్రం చొరవ తీసుకొని చర్చలకు పిలిచింది.
బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పలు మార్లు కేంద్రమంత్రులతో సమావేశమై ఆ ప్రాజెక్టు తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో పలు దఫాలు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కూడా మీడియాకు వివరించారు కేంద్రానికి తెలియజేశారు.
అందుకే ఇవాళ జరిగే మీటింగ్ అజెండాలో బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఉండకూడదని పట్టుబడుతోంది. ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాసింది. కేవలం కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల అజెండాగా మాత్రమే మీటింగ్ జరగాలని స్పష్టం చేసింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వడంతోపాటు ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. వీటిని అజెండాలో పెట్టాలని సూచిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని చట్టాలు, తీర్పుల ఉల్లంఘన ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని కూడా లేఖలో తెలిపింది. ఇలాంటి వాటితో నమ్మకం పోయే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడింది.
ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచర్లపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవరి ప్రయోజనాలకు భంగం వాటిల్లే పరిస్థితి లేదని చెబుతోంది. ఇది కేవలం వరద జలాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మాత్రమేనని చెబుతోంది. గతంలో తెలంగాణ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ చేసిన స్పీచ్‌లను కూడా సాక్ష్యాలుగా చూపిస్తోంది ఏపీ ప్రభుత్వం. అప్పట్లో అంగీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు వద్దని అంటున్నారని విమర్శిస్తోంది. అందుకే ఇవాళ్టి అజెండాలో ఆ ప్రాజెక్టు ఉంటేనే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని అనుమతులు రావడం సులభతరం అవుతుందని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది.