ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధి దేబోరా లైన్స్.. అఫ్గాన్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్‌లోని తాలిబన్ అధికారులతో సమావేశమైన తర్వాత ఆమె కాబూల్‌ను సందర్శించినట్లు టోలో న్యూస్ వెల్లడించింది.


హక్కానీ నేతలతో భేటీ..


హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన సిరాజ్ హక్కానీతో ఆమె భేటీ అయినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌ను ఆదుకోవడానికి మానవతా సాయం కోసం ఐరాస ఇప్పటికే పిలుపునిచ్చినట్లు ఆమె గుర్తుచేశారు. అఫ్గాన్‌లో మహిళా హక్కులను కాపాడాలని ఆమె కోరారు. 


అఫ్గాన్‌లో అమెరికా ప్రత్యేక రాయబారి జాల్‌మే ఖలీల్‌జాద్ సహా మరికొంతమంది ఖతార్ అధికారులను ఆమె కలవనున్నట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడేలా, హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేలా అమెరికా.. ఖతార్‌లో చర్చలు జరుపుతోంది.


Also Read: TIME Most Influential People: ఆ జాబితాలో భారత ప్రధాని మోదీ, బంగాల్ బెబ్బులి దీదీకి చోటు


మహిళలపై వివక్ష..


అఫ్గాన్‌ని చేజిక్కిచ్చుకున్న తర్వాత మహిళల విషయంలో తాలిబన్ల ఆంక్షలు అధికమవుతున్నాయి. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఆడవాళ్లు ముఖం, శరీరం కనిపించకుండా తల నుంచి కాలి వరకూ కప్పి ఉంచేలా తప్పనిసరిగా బుర్ఖా ధరించాలనే ఆదేశాలు ఇప్పటికే జారీ చేసింది సర్కార్. ఈ డ్రెస్‌కోడ్‌పై అత్యధికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎదిరించలేకపోతున్నారు.


కానీ కొంతమంది మహిళలు మాత్రం ఈ డ్రెస్‌కోడ్‌పై అంతర్జాల వేదికగా ఒక ఉద్యమమే చేస్తున్నారు. తాలిబన్‌ ఆజ్ఞలను ధిక్కరిస్తూ రంగురంగుల సంప్రదాయ దుస్తులు ధరించి, ఫొటోలు దిగి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.