Ukraine Spy Balloons: 


ఆరు బెలూన్‌లు..


దాదాపు రెండు వారాలుగా ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి స్పై బెలూన్‌లు. అమెరికా ఎయిర్‌ బేస్‌లో చైనా స్పై బెలూన్‌లు చక్కర్లు కొట్టడం వాటిని వరుసగా అగ్రరాజ్యం పేల్చేయడం లాంటి పరిణామాలు ఆ రెండు దేశాల మధ్య వేడిని మరింత పెంచాయి. అమెరికా స్పై బెలూన్లే తమను టార్గెట్ చేశాయని చైనా కౌంటర్ ఇచ్చింది. వీటిపై చర్చ జరుగుతుండగానే...ఇప్పుడు ఈ స్పై బెలూన్‌ల వివాదం రష్యా-ఉక్రెయిన్ మధ్య కూడా మొదలైంది. దాదాపు ఏడాదిగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలపై రష్యా క్షిపణుల దాడులు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ ఎయిర్‌ బేస్‌లో రష్యాకు చెందిన బెలూన్‌లు చక్కర్లు కొట్టడం సంచలనమైంది. దాదాపు 6 బెలూన్లు చాలా సేపు గగనతలంలో  తిరిగాయని, వాటన్నింటినీ పేల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఆ బెలూన్లలో "నిఘా పరికరాలు" ఉన్నట్టు అనుమానిస్తోంది ఉక్రెయిన్. అందుకే...గుర్తించిన వెంటనే షూట్ చేసినట్టు వివరించింది. వీటిని అలాగే వదిలేస్తే తమ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేసే ప్రమాదముందని భావించింది. బెలూన్‌లను గుర్తించిన వెంటనే ఉక్రెయిన్ ఆర్మీ సైరన్‌లు మోగించింది. అలెర్ట్ అయిన సైనికులు వాటిని పేల్చేశారు. ఇప్పుడే కాదు. గతంలోనూ చాలా సార్లు ఉక్రెయిన్‌ తమ గగనతలంలో రష్యా స్పై బెలూన్‌లు చక్కర్లు కొడుతున్నాయంటూ ఆరోపించింది.


చైనా కౌంటర్‌లు..


అమెరికా ఎయిర్‌ బేస్‌లో అనుమానాస్పద వస్తువులు చక్కర్లు కొడుతున్నాయి. వరుసగా వాటిని పేల్చేస్తోంది అగ్రరాజ్యం. ఇది కచ్చితంగా చైనా పనే అని తేల్చి చెబుతోంది. నిఘా పెట్టేందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని మండి పడుతోంది. ఈ ఆరోపణలపై స్పందించిన డ్రాగన్..కౌంటర్ ఇచ్చింది. అమెరికా తమ ఎయిర్‌బేస్‌లోకి స్పై బెలూన్‌లు పంపుతోందని ఆరోపించింది. జనవరి నుంచి ఇప్పటి వరకూ 10 బెలూన్స్‌ను గుర్తించామని వెల్లడించింది. అమెరికా అక్రమంగా తమ ఎయిర్‌బేస్‌లోకి బెలూన్‌లు పంపుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతేడాది నుంచే ఈ నిఘా మొదలైందని...ఇప్పటి వరకూ 10 కన్నా ఎక్కువగా స్బై బెలూన్‌లు పంపిందని చెప్పింది. చైనా అధికారుల అనుమతి లేకుండానే అక్రమంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇప్పటికే అమెరికా-చైనా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. నిత్యం ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి ఇరు దేశాలు. అగ్రరాజ్యం అనే  బిరుదు కోసం చైనా తపిస్తోంది. అమెరికాను దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. మరి కొన్ని దేశాలనూ చైనా టార్గెట్ చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది. ఈ లిస్ట్‌లో భారత్‌తో పాటు జపాన్‌ కూడా ఉంది. ఇప్పటికే ఈ బెలూన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్‌కు తెలిపింది. 


"చైనా స్పై బెలూన్ చాలా రోజులుగా యాక్టివ్‌గా ఉంటోంది. మిలిటరీ పరంగా బలంగా ఉన్న దేశాల సమాచారాన్ని సేకరిస్తోంది. జపాన్, భారత్, వియత్నాం, తైవాన్, ఫిలిప్పైన్స్‌పై నిఘా పెట్టింది"


-వాషింగ్టన్ పోస్ట్ 


Also Read: Zuckerberg's Security: జుకర్‌బర్గ్‌కు భారీగా సెక్యూరిటీ పెంచిన మెటా, లేఆఫ్‌ల ఎఫెక్టా?