Ukraine Returned Students:


అనుమతి ఇవ్వలేం..


ఉక్రెయిన్‌ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు భారత్‌లో సీటు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. సుప్రీం కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొంది. ఉక్రెయిన్‌ నుంచి వచ్చి ఇక్కడ వైద్య విద్యను కొనసాగించేందుకు అనుమతి కోరిన వారికి ఆ మేరకు పర్మిషన్ ఇవ్వలేమని ఆ అఫిడవిట్‌లో తెలిపింది. జస్టిస్ హేమంత్ గుప్తా నేతృత్వం వహిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం...ఈ అంశంపై
తదుపరి విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ నుంచి వచ్చి వైద్య విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. రష్యా-ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో తాము వైద్య విద్యను కొనసాగించలేకపోయామని అందులో వెల్లడించారు. స్టడీస్ కంటిన్యూ చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితులు బాలేకపోవటం వల్ల వెంటనే భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు. అడ్వకేట్ అశ్వర్య సిన్హా కూడా సుప్రీంకోర్టులో ఇదే విషయమై పిటిషన్ వేశారు. దాదాపు 14 వేల మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ఉన్నట్టుండి తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని..
తమ చదువుని కొనసాగించేలా చూడాలని అన్నారు. ఈ పరిణామాల వల్ల ఎంతో మంది విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని, వాళ్ల కెరీర్‌పై ఇదెంతో ప్రతికూల ప్రభావం చూపుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్లు తమ స్టడీస్‌నుకొనసాగించే పరిస్థితిలో లేరని, ఉక్రెయిన్‌ అందుకు అనుమతించటం లేదని వెల్లడించారు.  ప్రస్తుత నిబంధనల ప్రకారం... భారత్‌లో విద్యను కొనసాగించేలా చొరవ చూపాలని పిటిషన్‌లో కోరారు. 




వచ్చినప్పటి నుంచి ఇబ్బందులే..


ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు అదే సంవత్సరాన్ని భారత్‌లో కొనసాగించేలా అనుమతినివ్వాలని కోరారు పిటిషనర్లు. ఆ మేరకు...నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 లోని సెక్షన్ 46 ప్రకారం...గైడ్‌లైన్స్‌ విడుదల చేయాలని అడిగారు. ఇందుకు 
సంబంధించిన స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్‌ను ఫాలో అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ లో  ఉన్న భారతీయ విద్యార్థులు 18వేల మంది. ఇందులో 99శాతం మెడికల్ స్టూడెంట్లే ఉంటారు. అసలు వివిధ దేశాల్లో చదవుల కోసం ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా.. ? అక్షరాల 11లక్షల ౩౩వేల 749. విదేశాంగ శాఖ పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం ఇది. ఇంజనీరింగ్, ఐటీ కోసం ఎక్కువుగా యు.ఎస్. కెనడా, యుకె. ఆస్ట్రేలియా వెళుతున్నారు.


మెడికల్ కోసం అయితే మాత్రం అందరూ చూసేది.. ఎక్కువగా ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, చెనా.. యుక్రెయిన్‌లో 18వేల మంది ఉంటే.. చైనాలో 23వేలు, ఫిలిప్పీన్స్ లో 15వేల మంది భారతీయ విద్యార్థులున్నారు. వీళ్లంతా కూడా భారత్‌లో సీట్లు రాక.. వైద్య విద్యను అభ్యసించడం కోసం బయటకు వెళ్లిన వాళ్లే.. అయితే ఈ దేశాల్లో వైద్యం చదివిన వాళ్లు ...ఇండియాలో ప్రాక్టీస్‌ చేయడం అంత తేలిక కాదు. దానికోసం వాళ్లు అత్యంత కఠిన మైన ఫారిన్‌ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌ను -FMGE నెగ్గాల్సి ఉంటుంది. విదేశీ విద్యార్థుల్లో కేవలం నాలుగోవంతు మాత్రమే సక్సెస్‌ అవుతారు. అయినా దేశాలు దాటి వెళ్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి సమస్య రావటం వల్ల భారత్‌లో స్టడీస్‌ను కంటిన్యూ చేసేందుకు తంటాలు పడుతున్నారు. అటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ విద్యార్థులకు అండగా ఉంటామని గతంలో ప్రకటించారు. 


Also Read: Attack on Vladimir Putin: పుతిన్‌పై హత్యాయత్నం, కారుపై బాంబు దాడి చేసిన దుండగులు