మనిషి ప్రాణం నీటి బుడగ లాంటిది. ఎప్పుడు పగిలిపోతుందో చెప్పడం కష్టం. ఒక్కోసారి  చిన్న అజాగ్రత్త మూలంగా పెద్ద మూల్యం చెల్లించే పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. ఇది ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు, గానీ.. సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారు.. ప్రమాదాలు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోతున్నారు. 


ఓ వ్యక్తికి  చెందిన కారులో చిన్న సమస్య తలెత్తింది. వెంటనే ఆ వ్యక్తి ఆ కారును పక్కకు పార్క్ చేశాడు. ఏం జరిగిందో చెక్ చేయాలి అనుకున్నాడు. దాని ముందు నిలబడి హుడ్ తెరిచాడు. మళ్లీ కారు లోని వెళ్లి ఏవో చిన్న అడ్జెస్ట్ మెంట్స్ చేసి వచ్చాడు. బానెట్ ఏరియాలో నిలబడి ఏవో చిన్న రిపేర్లు చేయాలని భావించాడు. సమస్యను గుర్తించి పరిష్కరించాలి అనుకున్నాడు. కానీ, ఇంతలో అనుకోని ఘటన జరిగింది. కారు ముందుకు దూసుకొచ్చింది. అతడు కారుకు, ఎదురుగా ఉన్న దుకాణం షట్టర్ కు మధ్య ఇరుక్కుపోయాడు. అత్యంత ఘోరంగా ప్రాణాలు కోల్పోయాడు.


పక్కన ఉన్నవాళ్లు వెంటనే అక్కడికి చేరుకుని కారును వెనక్కి తీసే సరికి సదరు వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు.  మెకానిక్ దగ్గరికి కారును తీసుకెళ్లి సమస్యను సాల్వ్ చేసుకుంటే తను ప్రాణాలు కాపాడుకునేవాడు. ఈ ఘటన అక్కడున్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. ఈ వీడియోను దీపక్ ప్రభు అనే వ్యక్తి ట్విట్టర్ లో పోస్టు చేశారు. “సమస్య తలెత్తిన  ఆటోమేటిక్ వాహనం ముందు ఎప్పుడూ నిలబడకండి. దయచేసి మీ కుటుంబ సభ్యులు , స్నేహితులను అప్రమత్తం చేయండి.  అందుకు ఈఘటనను  ఉదాహరణగా చూపించండి” అని దీపక్ సూచించాడు.





హ్యాండ్ బ్రేక్ వేయక పోవడం మూలంగానే ఈ ప్రమాదం జరిగిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కారు రిపేర్ చేసే సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించాలని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా చిన్న నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణం కోల్పోవాల్సి వచ్చింది. ఒక వేళ మీ వాహనం ఏదైనా చెడిపోతే.. మెకానిక్ తో  చూపించండి. లేదంటే మీరే రిపేర్ చేసినా, తగు జాగ్రత్తలు తీసుకొని చేయండి. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.


Also Read: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఎందుకు ధరించాలి? అది ఎలా ప్రాణాలు కాపాడుతుంది?
Also Read: కారు కొంటున్నారా? అయితే, ఈ టాప్ 10 భద్రతా ఫీచర్లను పరిశీలించండి