Ukraine IMF Loan:


15.6 బిలియన్ డాలర్ల రుణం..


యుద్ధ భూమిగా మారిన ఉక్రెయిన్‌కు రుణం అందించేందుకు ముందుకొచ్చింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF). ఈ మేరకు ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. లోన్ ప్యాకేజ్ కింద 15.6 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఉక్రెయిన్ ఆర్థికంగా కుదుట పడేందుకు ఈ మొత్తం అందించనున్నట్టు IMF వెల్లడించింది. నాలుగేళ్లలో ఈ లోన్ ఇచ్చేలా అగ్రిమెంట్ కుదిరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో IMF అధికారులతో ఉన్నత స్థాయి భేటీ జరిగిన తరవాత ఈ అగ్రిమెంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 77 ఏళ్ల ఉక్రెయిన్ చరిత్రలో IMF నుంచి లోన్ అందడం ఇదే తొలిసారి. అయితే...ఈ లోన్ ప్రోగ్రామ్‌ను రెండు విడతల్లో అమలు చేయనుంది IMF. మొదటి విడతలో భాగంగా 12-18 నెలల్లో కొంత మొత్తం అందిస్తుంది. ఆ తరవాత మిగతా మొత్తాన్ని అందజేస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఐఎమ్‌ఎఫ్ బోర్డ్‌...ఈ అగ్రిమెంట్‌ను ఆమోదించనుంది. ఏడాది కాలంగా యుద్ధం జరుగుతున్న కారణంగా ఉక్రెయిన్ ఆర్థిక వృద్ధి రేటు 30% మేర పడిపోయిందని అంచనా. ఇప్పట్లో రికవరీ అవడం కూడా కష్టమేనని భావిస్తున్న సమయంలో IMF లోన్ ఇచ్చేందుకు ముందుకు రావడం ఆ దేశానికి కాస్త ఊరటనిచ్చింది. రష్యా క్షిపణుల దాడుల్లో ఉక్రెయిన్‌లోని మౌలిక వసతులన్నీ ధ్వంసమయ్యాయి. వీటన్నింటినీ పునరుద్ధరించాలంటే ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రష్యా ప్రెసిడెంట్‌ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది. 


జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు


ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను సన్నిహితులే చంపేస్తారని తేల్చి చెప్పారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఏడాది అయిన సందర్భంగా Year పేరిట ఓ డాక్యుమెంటరీ రూపొందించారు. ఇందులోనే జెలెన్‌స్కీ పుతిన్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుతిన్‌ పూర్తిగా బలహీనపడే సమయం త్వరలోనే వస్తుందని, ఆయన సన్నిహితులే ఆయనకు వ్యతిరేకంగా నడుచుకుంటారని జోస్యం చెప్పారు. 


"పుతిన్ పాలన ఎప్పుడో అప్పుడు అంతం కాక తప్పదు. రష్యా ప్రజలే ఆయనను వ్యతిరేకించే సమయం తప్పకుండా వస్తుంది. ఇన్ని హత్యలు చేస్తున్న పుతిన్‌నే హత్య చేసే  వాళ్లుంటారు. ఏదో ఓ కారణం చూపించి పుతిన్‌ను హతమార్చుతారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమే ఇస్తాను. కానీ ఎప్పుడు..? అంటే మాత్రం నేను చెప్పలేను" 


-జెలెన్‌స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు 


నిజానికి రష్యాలోనే పుతిన్‌పై వ్యతిరేకత పెరుగుతోందన్న వార్తలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఆయన సన్నిహితులే ఆయనపై తీవ్రం అసహనంతో ఉన్నట్టు ఈ మధ్యే వాషింగ్టన్ పోస్ట్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో తలపడుతున్న రష్యన్ సైనికులు కొందరు అకారణంగా దాడులు చేయలేకపోతున్నారని, కొందరైతే భావోద్వేగానికి లోనై ఏడుస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి. 


Also Read: 5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ