Innovation Centre in Delhi:
ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం..
ప్రధాని నరేంద్ర మోదీ Call Before u Dig (CBuD) యాప్‌ను ప్రారంభించారు. తవ్వకాలు జరిపే సమయంలో ఎలాంటి ఇబ్బందులు, నష్టం కలగకుండా ఈ యాప్ ద్వారా కమ్యూనికేట్ అవచ్చు. ఈ యాప్‌ను లాంఛ్ చేసే క్రమంలోనే ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దశాబ్దం టెక్నాలజీదేనని తేల్చి చెప్పారు. 6G గురించి కూడా ప్రస్తావించారు. ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్‌నూ ప్రారంభించారు. ఇదే కార్యక్రమంలో 6G విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు మోదీ. 2028-29 నాటికి దేశంలో 6G సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
"ఈ దశాబ్దం అంతా టెక్నాలజీదే. 5G లాంచ్ చేసి ఆర్నెల్లు కూడా కాలేదు. ప్రజలు అప్పుడే 6G గురించి మాట్లాడుకుంటున్నారు. భారత్ ఆత్మవిశ్వాసానికి ఇదే నిదర్శనం. టెలికామ్ టెక్నాలజీలో కేవలం వినియోగదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఎగుమతుల్లోనూ ముందంజలో నిలుస్తోంది. మన దేశంలోని టెలికాం రంగంపై అందరికీ నమ్మకం వచ్చింది. పారదర్శకంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 120 రోజుల్లోనే 125 సిటీల్లో 5G సేవలు మొదలయ్యాయి. త్వరలోనే మన దేశంలో 100 5G ల్యాబ్‌లు ఏర్పాటవుతాయి. ప్రజలను ఎంపవర్ చేసేందుకే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది."
- ప్రధాని నరేంద్ర మోదీ
ఇదే సమయంలో G20 గురించీ మాట్లాడారు ప్రధాని మోదీ. డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయని, ఈ విషయంలో మిగతా దేశాలకు మనం స్ఫూర్తిగా నిలుస్తున్నామని ప్రశంసించారు.
"G20 సదస్సుకి భారత్ నేతృత్వం వహించే రోజు వచ్చింది. ఇలాంటి కీలక తరుణంలో మా లక్ష్యం ఒకటే. ప్రాంతాల మధ్య అంతరాలను వీలైనంత వరకూ తగ్గించడం. దక్షిణ దేశాలన్నీ కొత్త టెక్నాలజీని వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇందులో ముఖ్య భూమిక పోషిస్తుంది. భారత్‌లో నెలకు 800 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రోజుకి కనీసం 7 కోట్లు ఈ-అథెంటికేషన్‌లు అవుతున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.28 లక్షల కోట్లు ఆయా ఖాతాల్లో జమ అవుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ అన్ని దేశాలకూ స్ఫూర్తిగా నిలుస్తోంది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లో భారత్‌దే పై చేయి"
- ప్రధాని నరేంద్ర మోదీ