Narasarao pet News : పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరొకసారి టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కోటప్పకొండ అభివృద్ది, ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమాలు బయటపెడతానని దమ్ముంటే బహిరంగచర్చకు రావాలని టీడీపీ నేత అరవింద్ బాబు సవాల్ చేశారు. రెండు వర్గాలు ఇలా సవాల్లు చేసుకుని కోటప్పకొండకు వెళ్లేందుకుప్రయత్నించాయి. కోటప్పకొండకుబయలుదేరిన అరవింద్ బాబు పోలీసులు అడ్డుకున్నారు. అరవింద్ బాబు ఆఫీస్ నుండి బయటకు రాకుండా గేట్లు మూసివేశారు. అయినప్పటికీ కోటప్పకొండ వెళ్లేందుకు ప్రయత్నించిన అరవింద్ బాబు ను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ కు తలించారు.
గత కొన్ని రోజుకుగా అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే అవినీతి, అక్రమాలను నిరూపిస్తానని, బహిరంగ చర్చకు కోటప్పకొండకు రావాలని టీడీపీ నేత చదలవాడ వైసీపీ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కోటప్పకొండపై బహిరంగ చర్చకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారని అన్నారు. జిల్లా ఎస్పీని ఈ కార్యక్రమం గురించి ముందుగా అనుమతి కోరామని, అయినప్పటికీ పోలీసులు ముందుగా హౌస్ అరెస్ట్ చేయడం గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓటమికి నిదర్శనమంటూ అరవింద్ అన్నారు. ప్రమాణం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నానని, అవినీతి , అక్రమ, అసత్య రాజకీయాలు చేయటంలో గోపిరెడ్డి దిట్ట అంటూ అరవింద్ బాబు విమర్శించారు.
గోపిరెడ్డి ప్రతి అడుగులో అవినీతి ఉందని, ప్రతి అవినీతికి సాక్ష్యం ఉందని అన్నారు. ఇసుక, రేషన్, గుట్కా, మట్కా, గంజాయి, ల్యాండ్ మాఫియా అన్నింటిలోనూ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. అన్ని అవినీతి కార్యకలాపాలకు చిరునామా గోపిరెడ్డి అంటూ చదలవాడ అరవింద్ బాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. దోచుకో, దాచుకో అనే కోణంలో గోపీరెడ్డి పరిపాలన సాగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీడీపీ నేత చదలవాడ కామెంట్స్ పై నరసరావుపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత గోపీరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకు ముందే ఏ సవాళ్లకైన, ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పామని అన్నారు. ఉగాది రోజు కాకుండా మరో రోజు బహిరంగ చర్చకు సిద్ధం అని ముందుగానే మేము చెప్పామన్నారు. ఉగాది రోజు అధికారులు సెలవులో ఉంటారని, మరోవైపు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. మరోరోజు బహిరంగ చర్చ పెట్టమంటూ 13న మేము సవాళ్లు విసిరామని అన్నారు.
13 నుండి 20 తారీఖు సాయంత్రం వరకు దీనిపై స్పందించకుండా సోమవారం స్పందనలో మీడియా ముందు ఉగాది రోజు చర్చకు రావాల్సిందే అంటూ ప్రకటించారని గోపిరెడ్డి అన్నారు. ప్రమాణానికి మేము ఎక్కడైనా, ఎప్పుడైనా సిద్ధమని ముందునుండే చెబుతున్నామని చెప్పామని అన్నారు. చదలవాడకు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు టిక్కెట్ కన్ఫర్మ్ చెయ్యలేదని, ఎలాగైనా టికెట్ సాధించాలనే తపనతో టీడీపీలో బలమైన సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకుని ఉనికిని చాటడంకోసమే చదలవాడ హైడ్రామా చేస్తున్నాడని గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉగాది తరువాత ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని గోపిరెడ్డి ప్రకటించారు. ఈ ఇద్దరి సవాళ్లతో నర్సరావుపేటలో ఉద్రిక్తత ఏర్పడింది.