Earthquake:
రాత్రి పూట కంపించిన భూమి..
ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య కాలంలో పలు దేశాల్లో భూకంపాలు నమోదవుతున్నాయి. కొన్ని చోట్ల స్వల్పంగా మరి కొన్ని చోట్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలుగుతోంది. భారత్‌లోనూ ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. ఢిల్లీ, NCRలో భూమి కంపించింది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రెండు చోట్లా రిక్టర్ స్కేల్‌పై 6.6 తీవ్రత నమోదైంది. ఈ రెండు దేశాల్లోనే కాకుండా మరి కొన్ని దేశాల్లోనూ భూమి కంపించింది. తుర్క్‌మెనిస్థాన్, కజకస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్‌లోనూ ఈ ప్రభావం కనిపించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. రాత్రి 10 గంటలకు అఫ్గనిస్థాన్‌లో ఒక్కసారిగా భూమి కంపించినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. లగ్మన్ ప్రావిన్స్‌లో ఇద్దరు మృతి చెందినట్టు తెలిపారు. పాకిస్థాన్‌లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ 13 ఏళ్ల బాలిక కూడా ఉంది. ఇల్లు కూలిపోయి పైకప్పు మీద పడటం వల్ల మృతి చెందింది. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే...ఎంత మంది గాయపడ్డారన్న లెక్క ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆసుపత్రులు బాధితులతో నిండిపోయాయి. కొంత మంది గాయాలతో ఆసుపత్రులకు రాగా...మరి కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్...అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించాలని ఆదేశించారు. అటు అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. నిజానికి...ఈ ప్రాంతంలో ఎప్పుడూ భూకంపాలు నమోదవుతూనే ఉంటాయి. 2005లో భారీ భూకంపం సంభవించింది. వేలాది మంది చనిపోయారు.