New Migrant Law in Britain:
ప్రధాని రిషి సునాక్ ట్వీట్..
యూకే ప్రధాని రిషి సునాక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా దేశంలోకి వలస వచ్చే వారిపై ఆంక్షలు విధించనున్నారు. చిన్న చిన్న పడవల్లో దేశంలోకి వచ్చే వాళ్లను అడ్డుకునేందుకు చట్టం తీసుకు రానున్నారు. ఇలా అక్రమంగా వచ్చే వారికి దేశం ఎలాంటి రక్షణ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు అధికారికంగా ట్వీట్ చేశారు.
"మీరు మా దేశంలోకి అక్రమంగా వస్తే చట్ట పరంగా మీకు ఎలాంటి భద్రత కల్పించలేం. మానవ హక్కుల పేరు చెప్పుకుని మీరు ఇక్కడ ఉండలేరు. మా చట్టాన్ని అతిక్రమించి వచ్చే వాళ్లను వారాల్లోనే ఇక్కడి నుంచి పంపేస్తాం. ఒక వేళ వాళ్ల సొంత దేశమే భద్రత కల్పిస్తుందని అనిపిస్తే నేరుగా అక్కడికే పంపుతాం. లేదంటే మరో సురక్షిత దేశానికి తరలిస్తాం. మళ్లీ మా దేశంలోకి అడుగు పెట్టకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తాం"
రిషి సునాక్, యూకే ప్రధాని
కొత్త వలస చట్టాన్ని సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భారత సంతతికి చెందిన హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మెన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"బ్రిటన్‌లోకి అక్రమంగా రావడం ఇప్పటికైనా ఆపకపోతే కచ్చితంగా వారిని వేరే చోటకు పంపేస్తాం. సొంత దేశానికైనా లేదంటే వాళ్లకు భద్రత కల్పించే ర్వాండా లాంటి దేశానికైనా తరలిస్తాం. పడవలను ఎక్కడికక్కడే ఆపేస్తాం. ఇలా అక్రమంగా వచ్చే వాళ్లను అడ్డుకోకపోతే మా దేశ ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది"
సుయెల్లా బ్రేవర్‌మెన్, హోమ్ సెక్రటరీ
ఎంతో మందికి ఆశ్రయం..
తమ సొంత దేశంలో ముప్పు ఎదుర్కొంటున్న వారికి బ్రిటన్ ఎప్పుడూ అండగానే నిలబడిందని వెల్లడించారు బ్రేవర్‌మెన్. 2015 నుంచి దాదాపు 5 లక్షల మందికి ఆశ్రయం కల్పించినట్టు తెలిపారు. హాంగ్‌కాంగ్ నుంచి లక్షా 50 వేల మంది, ఉక్రెయిన్ నుంచి లక్షా 60 వేల మంది, అఫ్గనిస్థాన్ నుంచి 25 వేల మంది వచ్చినట్టు లెక్కలతో సహా వివరించారు. హోమ్ సెక్రటరీగా తన బాధ్యతలు తాను నిర్వరిస్తానని స్పష్టం చేశారు. ఈ బిల్ ప్రకారం...బ్రిటన్‌లో అక్రమంగా వచ్చిన వారిని 28 రోజుల్లోగా వేరే చోటకు పంపుతారు. అంతర్జాతీయ చట్టాలను దృష్టిలో పెట్టుకునే అందుకు తగ్గట్టుగా ఈ బిల్ రూపొందించినట్టు బ్రిటన్ చెబుతోంది.