UK Next PM: రిషికి కలిసొచ్చిన దీపావళి- ప్రధాని రేసు నుంచి బోరిస్ జాన్సన్ ఔట్!

ABP Desam   |  Murali Krishna   |  24 Oct 2022 11:16 AM (IST)

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునక్‌కు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రధాని రేసు నుంచి బోరిస్ ఔట్!

UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు దీపావళి కలిసొచ్చింది. ప్రధాని పదవి రేసు నుంచి మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునక్‌కు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది.

కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యుల మద్దతు పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ, ఇటీవల పరిణామాలు చూస్తుంటే అలా చేయడానికి ఇది సరైన సమయం కాదనే నిర్ణయానికి వచ్చాను. పార్లమెంటులో పార్టీని ఐకమత్యంగా ఉంచకపోతే సమర్థ పాలన చేయలేం. ఈ విషయంలో సునక్‌, మోర్డాంట్‌లను సంప్రదించాను. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము కలిసి కట్టుగా పనిచేయాలని ఆశిస్తున్నాం. అందుకే నా నామినేషన్‌ను ముందుకు తీసుకెళ్లను. ఈ పోటీలో విజయం సాధించేవారికి నా పూర్తి మద్దతు ఉంటుంది.                   -  బోరిస్‌ జాన్సన్‌, మాజీ ప్రధాని

ఇంకెవరు?

బోరిస్ జాన్సన్ పోటీ నుంచి వైదొలగడ రిషికి కలిసొచ్చే అంశమే. పోటీలో ఉన్న మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌కు మెజారిటీ అంతంత మాత్రంగానే కనిపిస్తుండడంతో బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునక్‌ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

బ్రిటన్‌ ప్రధాని పదవికి పోటీలో నిలిచేందుకు కన్జర్వేటివ్‌ పార్టీలో 100 మంది ఎంపీల మద్దతు అవసరం. రిషి సునక్‌కు ఇప్పటికే 144 మంది సభ్యుల మద్దతు లభించింది. ఇప్పటివరకు 59 మంది సభ్యుల మద్దతు పొందిన బోరిస్‌ పోటీ నుంచి వైదొలిగారు. ఇక మరో నాయకురాలు పెన్నీ మోర్డాంట్‌ ఇప్పటివరకు కేవలం 23 మంది సభ్యుల మద్దతే కూడగట్టారు. 

రిషి పిలుపు

యూకే ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానని, పార్టీలోనూ ఐక్యత సాధించేలా చొరవ చూపుతానని రిషి అన్నారు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నందునే ప్రధాని రేసులో ఉన్నానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు.

యూకే చాలా గొప్ప దేశం. కానీ...మనం ఎన్నడూ లేనంతగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాన్ని బట్టే మన దేశ భవితవ్యం ఆధార పడి ఉంటుంది. అందుకే..ఈ ప్రధాని రేసులోకి వచ్చాను. మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడి పెట్టాలన్నదే నా ఆకాంక్ష. ఛాన్సలర్‌గా ప్రజలకు సేవలందించాను. కష్టకాలంలో ఆర్థికంగా నిలదొక్కుకోటానికి సహకరించాను. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్లు చాలా పెద్దవని తెలుసు. కానీ..సరైన నిర్ణయాలు తీసుకుంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి.                                  - రిషి సునక్, ప్రధాని అభ్యర్థి

Also Read: Diwali 2022: కార్గిల్‌లో ప్రధాని- సైనికులతో కలిసి మోదీ దీపావళి సంబరాలు

Published at: 24 Oct 2022 11:12 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.