UK Man Leaves 50 Pounds: యూకేలో ఓ వింత ఘటన జరిగింది. తనను చూడడానికి మనవరాళ్లు రావడం లేదన్న కోపంతో ఓ 91 ఏళ్ల వ్యక్తి తన ఆస్తిలో కేవలం 50 పౌండ్‌లు మాత్రమే వాళ్లకి రాసిచ్చాడు. ఆయన ఆస్తి విలువ 5 లక్షల పౌండ్లకుపైగానే ఉంది. అయినా...పట్టుబట్టి మరీ 50 పౌండ్‌లు మాత్రమే మనవరాళ్ల పేరిట రాశాడు. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. అప్పుడు కానీ జడ్జ్ ఈ విషయం చెప్పలేదు. తన మనవరాళ్లు చూడడానికి రాలేదని, ఈ కోపంతోనే ఆస్తి ఇవ్వదలుచుకోలేదని చెప్పినట్టు జడ్జ్ వివరించారు. ఒకప్పుడు సైన్యంలో పని చేసిన 91 ఏళ్ల ఫెడ్రిక్ వార్డ్ 2020లోనే మృతి చెందాడు. ఆయన చనిపోయాక ఇంట్లో ఆస్తి గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి పిల్లల పేరిట 4 లక్షల 50 వేల పౌండ్‌ల విలువైన అపార్ట్‌మెంట్‌ని రాసిచ్చాడు. అతని కొడుకు 2015లో చనిపోయాడు. ఈ కొడుకుకి ఐదుగురు కూతుళ్లున్నారు.


తాను బతికి ఉన్నప్పుడే లాయర్స్‌ని పిలిచి వీలునామా రాశాడు. ఆ సమయంలోనే వాళ్లకు ఓ విషయం చెప్పాడు. "నేను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. మూడు సార్లు హాస్పిటల్‌లో చేరి చికిత్స చేయించుకున్నాను. ఇంత జరిగినా నన్ను చూడడానికి మనవరాళ్లు రాలేదు. అందుకే నా ఆస్తిలో 50 పౌండ్లు మాత్రమే వాళ్లకి ఇవ్వాలనుకుంటున్నాను" అని తేల్చి చెప్పాడు. ఈ వీలునామా చూసిన ఆ ఐదుగురు మనవరాళ్లు కోర్టు మెట్లు ఎక్కారు. ఆస్తిలో మూడొంతుల వాటాపై తమకు హక్కు ఉంటుందని వాదించారు. ఎవరో ఆయనను తప్పుదోవ పట్టించి ఇలా చేశారని మండి పడ్డారు. ఈ పిటిషన్‌ని కోర్టు కొట్టి వేసింది. ఆయన అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నట్టు ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. ఆ పెద్దాయన చివరిసారిగా మాట్లాడిన మాటల్నీ రికార్డ్ చేసి కోర్టులో వినిపించారు.