Vivo V30 Pro: వివో వీ30, వీ30 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు, 1.5కే కర్వ్‌డ్ డిస్‌ప్లేలు ఉన్నాయి. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 14 ఆధారిత యూఐపై వివో వీ30 సిరీస్ రన్ కానుంది.
వివో వీ30 ధర (Vivo V30 Price in India)
ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999గానూ, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999గానూ నిర్ణయించారు. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పీకాక్ గ్రీన్ షేడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
వివో వీ30 ప్రో ధర (Vivo V30 Pro Price in India)
వివో వీ30 ప్రో రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999గానూ నిర్ణయించారు. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్ రంగుల్లో వివో వీ30 ప్రో కొనుగోలు చేయవచ్చు.
దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. మార్చి 14వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్లలో దీని సేల్ ప్రారంభం కానుంది. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభించనుంది. ఎనిమిది నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ, 40 శాతం వరకు వివో వీ-షీల్డ్ ప్లాన్ డిస్కౌంట్ కూడా అందించనున్నారు.
వివో వీ30, వీ30 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Vivo V30 Specifications)
ఈ రెండు ఫోన్లలోనూ 6.78 అంగుళాల 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు అందుబాటులో ఉన్నాయి. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి ఫీచర్లు కూడా అందించారు. వివో వీ30 క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌పై, వీ30 ప్రో ((Vivo V30 Pro Specifications) మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్‌పై పని చేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్లు రన్ కానున్నాయి.
ఇక కెమెరాల విషయానికి వస్తే... వివో వీ30లో వెనకవైపు రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. వీ30 ప్రోలో మాత్రం మూడు కెమెరాలు అందించారు. ఇవి కూడా మూడూ 50 మెగాపిక్సెల్ సెన్సార్లే. రెండు ఫోన్లలోనూ ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లు ఉన్నాయి.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?