UK General Election 2024: యూకేలో సార్వత్రిక ఎన్నికలు (UK General Election) జరుగుతున్నాయి. రిషి సునాక్ భవితవ్యం ఈ ఎన్నికలతో తేలిపోనుంది. బ్రిటీష్ రాజకీయాల్ని డిసైడ్ చేసేది కూడా ఈ ఎలక్షన్సే కావడం వల్ల ఉత్కంఠ పెరుగుతోంది. అయితే..ఇప్పటి వరకూ ఒపీనియన్ పోల్స్ అన్నీ రిషి సునాక్‌కి షాక్ (Rishi Sunak) తప్పదనే తేల్చి చెప్పాయి. కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోతుందని స్పష్టం చేశాయి. ఇక రిషి సునాక్‌తో పాటు ప్రధాని రేసులో ఉన్న కీర్ స్టార్మర్ (Keir Starmer) లేబర్ పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా ఈ ఎన్నికలపై ఆసక్తి మరింత పెరిగింది. నిన్న మొన్నటి వరకూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించిన రిషి సునాక్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లేబర్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం అంటే సమస్యలు కొని తెచ్చుకోవడమే అని అన్నారు. పన్నుల రూపంలో భారం పడుతుందనీ హెచ్చరించారు. దీనిపై కీర్ స్టార్మర్ మండి పడ్డారు. ప్రజలు ఓటు వేయకుండా నిరుత్సాహపరుస్తున్నారని విమర్శించారు. రిషి సునాక్‌ని తప్పించాలంటే అందరూ కచ్చితంగా ఓటు వేయాల్సిందేనని కీర్ స్టార్మర్ పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీల మధ్య ఈ సారి టఫ్ ఫైట్ (Rishi Sunak Conservative Party) తప్పేలా లేదు.
ఎన్నికల వివరాలివే..
బ్రిటన్‌లోని మొత్తం 650 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 40 వేల పోలింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ సారి కీర్ స్టార్మర్ కచ్చితంగా ప్రధాని (UK Election 2024) అవుతారని లేబర్ పార్టీ చాలా బలంగా నమ్ముతోంది. బ్రిటన్‌కి కొత్త దారి చూపిస్తారని ప్రచారం చేసుకుంటోంది. అంతే కాదు. ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకుంటున్నట్టూ వెల్లడించింది. రిషి సునాక్ ఎన్నికల ప్రచారమూ పూర్తిగా కీర్ స్టార్మర్‌ని టార్గెట్ చేస్తూ కొనసాగింది. సోషల్ మీడియాలోనూ పదేపదే ఇవే పోస్ట్‌లు పెట్టారు. అయితే...ఈ ప్రచారాన్ని ఉదాహరణగా చూపిస్తూ రిషి సునాక్‌కి ఓటమి భయం పట్టుకుందని లేబర్ పార్టీ విమర్శిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. 365 సీట్లు గెలుచుకుంది. ప్రస్తుతానికి దేశం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది. వీటిని పరిష్కరిస్తానని చెప్పిన సునాక్..ఆశించిన స్థాయిలో ఏమీ చేయలేకపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్న వాదనా వినబడుతోంది. అందుకే ఒపీనియన్ పోల్స్ ఆయనకు అనకూలంగా రాలేదని కొందరు తేల్చి చెబుతున్నారు.
Also Read: Bihar Bridge Collapse: ఇవి పేకమేడలా వంతెనలా, 17 రోజుల్లో కుప్ప కూలిన 12 బ్రిడ్జ్‌లు