Bridge Collapse in Bihar: బిహార్‌లో వరుస పెట్టి వంతెనలు కూలిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 17 రోజుల్లో 11 బ్రిడ్జ్‌లకు ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సరన్‌ జిల్లాలో మరో బ్రిడ్జ్‌ కుప్ప కూలింది. సరన్‌ జిల్లాలో కేవలం 24 గంటల్లో మూడు వంతెనలు ఇలాగే కూలిపోయాయి. గండకీ నదిపై 15 ఏళ్ల క్రితం ఈ బ్రిడ్జ్‌ని నిర్మించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని తెలిపారు. ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. కొద్ది రోజులుగా వంతెనలు కూలిపోతుండడంపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా కూలిపోయే దశలో ఉన్న వంతెనలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నింటిపైనా సర్వే చేసి అవసరమైతే మరమ్మతులు చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రిడ్జ్‌ల మెయింటేనెన్స్ విషయంలో అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని తేల్చి చెప్పారు. సరన్‌ జిల్లాలో కాకుండా సివాన్, మధుబని, ఈస్ట్ చంపరన్, కృష్ణగంజ్‌లోనూ వంతెనలు కూలిపోయాయి. జూన్ 18న అరారియా జిలాల్లో వంతెన కూలింది. ఆ తరవాత జూన్ 22న సివాన్ జిల్లాలో, జూన్ 23 న ఈస్ట్ చంపారన్‌లో బ్రిడ్జ్‌లు కూలాయి. దియోరియాలో గండకీ నదిపై నిర్మించిన 40 ఏళ్ల నాటి బ్రిడ్జ్ పిల్లర్ కుంగిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. 


ఈ ఘటనలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. RJD ఇప్పటికే ప్రధాని మోదీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తోంది. ఇంత జరుగుతుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తోంది. ట్విటర్ వేదికగా RJD నేత తేజస్వీ యాదవ్‌ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ కూడా ఏమీ మాట్లాడడం లేదని మండిపడ్డారు. అంతా అవినీతిమయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


"మాట్లాడితే అవినీతి, నిజాయతీ, జంగల్ రాజ్‌ అంటూ లెక్చర్లు ఇస్తారు. వేరే వాళ్లలో లోపాలు ఎత్తి చూపిస్తుంటారు. అంతా తమకే తెలుసని అనుకుంటారు. వీళ్లే అడ్వకేట్‌లు, జర్నలిస్ట్‌లుగా ఫీల్ అవుతుంటారు. కానీ...ఇంత జరుగుతుంటే ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు"


- తేజస్వీ యాదవ్, RJD నేత






కొంత మంది అధికారులు మాత్రం ఈ ఘటనలపై స్పందించారు. వీటిని ప్రమాణాల ప్రకారం నిర్మించలేదని, అందుకే కూలిపోయి ఉంటాయని వెల్లడించారు. అదీ కాకుండా భారీ వర్షాలు, వరదల కారణంగా కొన్ని వంతెనలు ధ్వంసమయ్యాయని వివరించారు. 


Also Read: Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో