Air Pollution Deaths in India: భారత్‌లోని ప్రధాన నగరాల్లో కేవలం కాలుష్యం కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. The Lancet Planetary Health జర్నల్ ఈ సంచలన విషయం వెల్లడించింది. ఇండియాలోని 10 ప్రధాన నగరాల్లో రోజూ నమోదవుతున్న మరణాల్లో వాయు కాలుష్యం కారణంగా మృతి చెందుతున్న వాళ్లు 7% మందికి పైగా ఉంటున్నారని తేల్చి చెప్పింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని హెచ్చరించింది. ఈ నగరాల్లోని గాల్లో PM2.5 మేర ధూళికణాలుంటున్నాయని వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ PM2.5ని ప్రమాదకరంగా పరిగణిస్తోంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కత్తా, హైదరాబాద్, ముంబయి,పుణే, అహ్మదాబాద్, షిమ్లా, వారణాసి నగరాల్లోని వాతావరణ పరిస్థితులను పరిశీలించి ఈ రిపోర్ట్ విడుదల చేసింది. ధూళి కణాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత ప్రమాదకరంగా మారతాయి. ఈ నగరాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఈ చిన్న ధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోతున్నాయి. రక్త సరఫరాపైనా ప్రభావం చూపిస్తున్నాయి. PM 2.5 అంటే particles 2.5 micrometres అని అర్థం. అంటే ఈ ధూళి కణాల సైజ్‌ని సూచిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. నెల వారీగా చూసినా, ఏటా లెక్కలు పరిశీలించినా ఢిల్లీలోనే కాలుష్య మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపింది.
వాహనాలు, పరిశ్రమల నుంచి ఇవి ఎక్కువగా గాల్లోకి (Air Pollution Effects on Health) విడుదలవుతున్నాయి. ఏటా ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల 12 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మొత్తం మరణాల్లో ఇది 11.5%. ఈ ధూళి కణాలు ప్రాణాలు తీసే ప్రమాదం ఎక్కువగా ఉందని రీసెర్చర్స్ తేల్చి చెబుతున్నారు. ఏటా మొత్తంగా 33 వేల మంది కేవలం పొల్యూషన్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల వరకూ ధూళి కణాలుండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితికి ఈ ప్రమాణానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. 2008-2019 మధ్య కాలంలో PM2.5 ఉన్న నగరాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని రిపోర్ట్ తెలిపింది. ఇవే పరిస్థితులు కొనసాగితే రోజూవారీ మరణాలు కూడా విపరీతంగా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది.
ఈ 11 ఏళ్లలో కాలుష్యం కారణంగా ఏటా బెంగళూరులో 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, ముంబయిలో 5,100 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. షిమ్లాలో కాలుష్య స్థాయి కాస్త తక్కువగానే ఉంది. అక్కడ మరణాలూ తక్కువగానే నమోదయ్యాయి. కాసేపు కాలుష్య వాతావరణంలో గడిపినా అది ఆయుష్షుని తగ్గించేస్తుందని (Air Pollution Causes) నివేదిక స్పష్టం చేసింది. అంత ప్రమాదకరంగా కాలుష్యం ఉందని తెలిపింది. ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోకపోతే ఈ మరణాలు ఇంకా పెరిగే ప్రమాదముందని హెచ్చరించింది. లంగ్ క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, గుండె పోటుని కట్టడి చేయాలంటే కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కాలుష్య సమస్యపై ఆందోళన వ్యక్తం చేసింది.