Hathras Stampede Death: హత్రాస్‌ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గాయపడ్డారు. ఇప్పటికే ఈ ఘటనపై జ్యుడీషియరీ ఎంక్వైరీకి యోగి సర్కార్ ఆదేశాలిచ్చింది. విచారణకు సిట్‌ని కూడా నియమించింది. అయితే...ఇంతటి విషాదానికి కారణమైన భోలే బాబా గురించి రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. ఈ బాబాకి అతీంద్రియ శక్తులున్నాయని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. అలా నమ్మేలా చేశాడు భోలే బాబా. ఏ రోగాన్నైనా నయం చేస్తాడని, దయ్యాలు భూతాలనూ బెదరగొడతాడని విశ్వసిస్తారు. ఇలాంటి చెప్పి నమ్మించి మోసం చేసి 2000 సంవత్సరంలో ఓ సారి అరెస్ట్ అయ్యాడు. 16 ఏళ్ల బాలిక మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యుల నుంచి బలవంతంగా లాక్కున్నాడు. తన శక్తులతో ఆమెకి మళ్లీ ప్రాణం పోస్తానని చెప్పాడు. ఈ ఘటన అప్పట్లో అలజడి రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు భోలే బాబాపై కేసు నమోదు చేశారు. ఆ తరవాత ఆ కేసుని అటకెక్కించారు. 


కానిస్టేబుల్ నుంచి బాబా వరకూ..


1990 వరకూ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేసిన సూరజ్ పాల్ అలియాస్ భోలే బాబా ఆ తరవాత తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రచారం చేసుకున్నాడు. బాబా అవతారమెత్తాడు. వెనకబడిన వర్గాలకు చెందిన ప్రజల్ని ఆకర్షించాడు. వాళ్ల ద్వారానే పేరు సంపాదించుకున్నాడు. అయితే...భోలే బాబా కూడా వెనకబడిన వర్గానికి చెందిన వాడేనని, తమ నుంచి ఏమీ ఆశించడని కొందరు భక్తులు చెబుతుంటారు. భక్తులు మరో కీలక విషయం కూడా చెప్పారు. సత్సంగ్ ముగిసే ముందు భోలే బాబా "ఏదో ప్రళయం వస్తుంది" అని అన్నారని, ఆయన చెప్పినట్టుగానే విషాదం జరిగిందని వివరించారు. 


"భోలే బాబా మా నుంచి ఏమీ తీసుకోరు. సత్సంగ్ కార్యక్రమంలో అంతా మంచి విషయాలే చెబుతారు. అబద్ధాలు చెప్పకూడదని, మాంసం తినొద్దని, మద్యం తాగొద్దని సూచిస్తారు. ఇప్పటికే చాలా సార్లు ఈ కార్యక్రమానికి వచ్చాను. చాలా మంది మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు"


- భక్తులు






ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సిట్‌ని నియమించినట్టు వెల్లడించింది. ఇప్పటికే ఓ ప్రాథమిక రిపోర్ట్‌ని అందించింది. ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్రంతో పాటు కేంద్ర ప్రభుత్వమూ సాయం అందించనుంది. అయితే...ఎవరైనా కుట్ర చేశారా అన్న కోణంలోనూ విచారిస్తున్నట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. త్వరలోనే దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తామని తెలిపారు. కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. 


Also Read: Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో