Udhayanidhi Stalin To Become Deputy CM: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అధికార DMK పార్టీ జోరు మరింత పెరిగింది. మెజార్టీ స్థానాలు సాధించి పట్టు నిలుపుకుంది ఈ పార్టీ. అయితే...ప్రభుత్వంలో కీలక మార్పులు చేసేందుకు హైకమాండ్‌ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి MK స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్‌లో ఉన్నారు. క్రీడాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. త్వరలోనే ఆయనకు డిప్యుటీ సీఎం పదవిని కట్టబెట్టనున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత వేగంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. 2009లో లోక్‌సభ ఎన్నికలు పూర్తైన వెంటనే అప్పట్లో ఎమ్‌కే స్టాలిన్ డిప్యుటీ సీఎం అయ్యారు. ఆ తరవాత సీఎం అయ్యారు. ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతూ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్‌ని డిప్యుటీ సీఎం కుర్చీలో కూర్చోబెట్టనున్నారు.


చెపాక్ తిరువళ్లికెని నియోజకవర్గం నుంచి MLAగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ 2022 డిసెంబర్‌లో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఇప్పటికే ఆయనకు ఈ పదవి దక్కాల్సింది. కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల పొలిటికల్‌గా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి సమయంలో పదవి ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో హైకమాండ్‌ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇప్పుడు అంతా క్లియర్‌ కావడం వల్ల ఉప ముఖ్యమంత్రిని చేయాలని పట్టుదలతో ఉన్నారు ఎమ్‌కే స్టాలిన్. 


ఈ ఏడాది జనవరిలో ఉదయ నిధి స్టాలిన్‌ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం డెంగీ, మలేరియా లాంటిదని అలాంటి వ్యాధుల్ని అంతం చేయాలని నోరు జారారు. కులం పేరుతో వివక్ష ఎందుకని ప్రశ్నిస్తూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌ సంచలనం సృష్టించాయి. ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. ఉదయనిధి స్టాలిన్‌ని కోర్టులు మందలించాయి కూడా. సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇదంతా సద్దుమణిగింది అనుకునేలోగా ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం కలకలం రేపింది. కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది ప్రాణాలు కోల్పోయారు.


లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఈ ఘటన జరగడం ప్రభుత్వానికి సవాల్ విసిరింది. అప్పటికప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది. అయితే...ఉదయనిధి స్టాలిన్‌ని డిప్యుటీ సీఎం చేసే విషయంలో ఎమ్‌కే స్టాలిన్‌దే తుది నిర్ణయమని పార్టీలోని కీలక నేతలు స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలు గుప్పిస్తుంటారు ఉదయనిధి స్టాలిన్. లోక్‌సభ ఎన్నికల్లో గట్టిగా ప్రచారం చేశారు. పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. మదురైలో AIIM ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందంటూ చేసిన ప్రచారం బాగానే కలిసొచ్చింది. ప్రస్తుతానికి పార్టీని ముందుండి నడిపించే సత్తా ఉదయనిధికి ఉందని సీఎం భావిస్తున్నారు. 


 Also Read: US Election 2024: ప్రెసిడెంట్ రేసు నుంచి తప్పుకోనున్న బైడెన్! రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం?