Joe Biden to Quit US Presidential Race: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకునే అవకాశాలున్నాయి. ఆయన పోటీ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై ఓ క్లారిటీ రానుంది. బైడెన్ అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశముంది. నిజానికి బైడెన్‌ పోటీపై ప్రతిపక్షమైన రిపబ్లిక్ పార్టీ మాత్రమే కాదు. సొంత పార్టీ నుంచే వ్యతిరేక వ్యక్తమవుతోంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ ఈ పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నారు. వయసు మీద పడడం వల్ల ఆయన ప్రవర్తన అంతా గందరగోళంగా తయారైంది. ఆ మధ్య ప్రెసిడెంట్‌ డిబేట్‌లో ట్రంప్‌ ఎన్ని విమర్శలు చేసినా వాటికి బైడెన్ దీటుగా సమాధానం ఇవ్వలేకపోయారు. అప్పటి నుంచే రిపబ్లిక్ పార్టీలో అలజడి మొదలైంది. బైడెన్ చాలా రోజులుగా తీవ్ర ఒత్తిడి లోనవుతున్నారని, అందుకే పోటీలో ఉండాలా వద్దా అన్న ఆలోచనలో పడ్డారని సన్నిహితులు కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం బైడెన్‌కి కరోనా సోకింది. మరో రెండు మూడు రోజుల్లో ఐసోలేషన్ పూర్తవుతుంది. అప్పుడే ఆయన బయటకు వచ్చి ఏదో ఓ ప్రకటన చేసే అవకాశముంది. అసలు ప్రచారం చేయగలిగే శక్తి ఉందో లేదో కూడా ఓ సారి ఆలోచించుకోవాలని బరాక్ ఒబామా సూచించినట్టు సమాచారం. అయితే...రేసులో ఉండాలా వద్దా అన్నది పూర్తిగా బైడెన్‌ వ్యక్తిగత నిర్ణయమని ఒబామా తేల్చిచెప్పారు. 


ఆయన అర్థం చేసుకుంటారా..? 


కాస్తంత సర్దిచెప్తే బైడెన్ అర్థం చేసుకుంటారని, రేసు నుంచి తప్పుకుంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అసలు ఈ ఎన్నికల్లో నిలబడినా గెలిచే అవకాశాలు చాలా తక్కువేనని, అందుకే గౌరవంగా తప్పుకోవడం మంచిదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ సారి బైడెన్‌ ఓటమి పాలైతే అది పార్టీపైనే ప్రభావం పడుతుందని, మళ్లీ గెలిచే అవకాశాలు కూడా ఉండకపోవచ్చన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయన మద్దతుదారులు మాత్రం అప్పుడే దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయడం లేదు. ఆయన అమెరికా కోసం చాలానే చేశారని, ప్రెసిడెంట్‌ రేసులో తప్పక ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఇప్పటి వరకూ అయితే జో బైడెన్ నోట మాత్రం "నేను తప్పుకుంటాను" అన్న మాట వినబడలేదు. చాలా ఫిట్‌గా ఉన్నానని, తప్పుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కానీ ఆ తరవాత కీలక వ్యాఖ్యలు చేశారు. తన హెల్త్ స్టేటస్‌ని బట్టి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. ఆ తరవాత వెంటనే కొవిడ్ సోకింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైట్‌హౌజ్ ప్రతినిధులు ప్రకటించారు. నవంబర్ 9వ తేదీన అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ లోగా ఆయన ఆరోగ్యం ఎలా కుదుట పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి కీలక తరుణంలో ఆయన ప్రెసిడెంట్ పోటీ నుంచి తప్పుకుంటారన్న వార్తలు కీలకంగా మారాయి.


Also Read: Joe Biden: భార్య అనుకుని వేరే మహిళకు ముద్దు పెట్టబోయిన బైడెన్ - వీడియో వైరల్