ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: ఉద్దవ్ ఠాక్రే 


గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి వివాదాస్పద వ్యాఖ్యలపై శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే స్పందించారు. మరాఠీలను దారుణంగా అవమానించారంటూ తీవ్రంగా మండి పడ్డారు. "నాకు గవర్నర్ హోదాలో ఉన్న వారిని కించపరచాలనే ఉద్దేశం లేదు. ఆ పదవికి నేనెంతో గౌరవమిస్తాను. కానీ భగత్ సింగ్ కొష్యారి మరాఠీలను కించపరిచారు. ప్రజల్లోనూ ఆయన వ్యాఖ్యలు ఆగ్రహం కలిగిస్తున్నాయి. మతపరంగా ప్రజల్ని విడగొట్టాలని చూస్తున్నారు. హద్దులు దాటి మరీ మాట్లాడారు" అని అసహనం వ్యక్తం చేశారు ఉద్దవ్ ఠాక్రే. "దాదాపు రెండున్నరేళ్లుగా ఆయన మహారాష్ట్రలోనే ఉంటున్నారు. ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. ఇప్పుడాయన కొల్హాపూర్ చెప్పులను చూడాల్సిన సమయం ఆసన్నమైంది" అని కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన వెంటనే మరాఠీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయనను పదవి నుంచి తొలగించటమా లేదంటే జైల్లో పెట్టడమా అన్నది అధిష్ఠానమే నిర్ణయించుకోవాలని సూచించారు. గతంలో సావిత్రిభాయ్ ఫూలే గురించి కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారని గుర్తు చేశారు.









 


మరాఠీలకు ఇది తీరని అవమానం : సంజయ్ రౌత్ 


దాదాపు నెల రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి. రోజూ శివసేన, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ వివాదం కొనసాగుతుండగానే, మరోటి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొషియారి చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తీసేస్తే రాష్ట్రానికి రెవెన్యూనే ఉండదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముంబయి, థానే నుంచి వారిని వేరు చేయలేమని, వారు అక్కడి నుంచి వెళ్లిపోతే రాష్ట్రానికి ఆదాయమే ఉండదన్న ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు. అంతే కాదు. ఇదే జరిగితే... ముంబయి దేశ ఆర్థిక రాజధానిగానూ కొనసాగలేదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఠాక్రే శివసేన తీవ్రంగా మండిపడుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గవర్నర్‌పై ఆగ్రహించారు. "మరాఠీలను అవమానించారు" అంటూ ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిజానికి ఎన్నో ఏళ్లుగా...మహారాష్ట్రలో మరాఠీలకు, గుజరాతీలకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాతావరణం ఉన్న రాష్ట్రంలో గవర్నర్ అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై సంజయ్ రౌత్‌ తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆయన చేసిన కామెంట్స్‌ను
వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే ఖండించాలని డిమాండ్ చేశారు.


"మరాఠీల గౌరవానికి భంగం కలిగించారు" అని ట్విటర్‌లో గవర్నర్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. భాజపాకు చెందిన ముఖ్యమంత్రి రాగానే...మరాఠీలకు అవమానం జరిగిందని అన్నారు సంజయ్ రౌత్. కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, సచిన్ సావంత్ కూడా ఈ వివాదంపై స్పందించారు. గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది అని అన్నారు. 


Also Read: Minister Roju : ఆ ఫొటో నా జీవితాన్నే మార్చేసింది - మంత్రి రోజా


Also Read: NTR T Shirt Cost : 'బింబిసార' ఫంక్షన్‌కు ఎన్టీఆర్ వేసుకొచ్చిన టీ షర్ట్ రేటు ఎంతో తెలుసా?