Nellore Police Suspend : నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ దివ్యాంగుడి ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణల ఎదుర్కొంటున్న నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. మర్రిపాడు ఎస్‌.ఐ వెంకటరమణ, ఏఎస్‌ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు ఎస్‌.కె చాంద్‌ బాషా, సంతోష్‌ కుమార్‌ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


అసలేం జరిగింది ?


మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు తిరుపతిని ఓ చోరీ కేసులో వారంలో మూడుసార్లు పోలీసులు విచారణకు పిలిచారు. పోలీసులు తమ కుమారుడిని శారీరకంగా వేధించారని, అందుకే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ తిరుపతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్పీ విజయరావు విచారణ చేసి నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. 


ఫెన్సింగ్ విషయంలో వివాదం


నెల్లూరు జిల్లాలోనే అనంతసాగరం మండలం గుడిగుంట్లకు చెందిన పొట్టపల్లి శ్రీనివాసులు, లక్ష్మమ్మ ఉపాధి కోసం చుంచులూరుకు వలసవచ్చారు. వారికి దివ్యాంగుడైన కుమారుడు తిరుపతి ఉన్నాడు. చుంచులూరులో ఆ కుటుంబం కృష్ణమూర్తి  అనే రైతుకి చెందిన పొలానికి కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉండేది. సరిగా నడవలేని తిరుపతి ఇంటి దగ్గరే ఉండేవాడు.  కృష్ణమూర్తికి చెందిన పొలం పక్కనే ఆందనేయ రెడ్డి అనే వ్యక్తికి కూడా పొలం ఉండేది. ఆ పొలానికి వేసిన ఫెన్సింగ్ కంచెను ఎవరో దొంగతనం చేశారు. దొంగతనం చేసినవారిని విచారించే క్రమంలో స్థానిక ఎస్సై వెంకట రమణ తిరుపతిని స్టేషన్ కి పిలిపించారని సమాచారం. అయితే విచారణ పేరుతో ఎస్సై వెంకట రమణ తమ కుమారుడు తిరుపతిని స్టేషన్ కి పిలిపించి కొట్టేవారని ఆరోపించారు తిరుపతి తల్లిదండ్రులు. ఈ క్రమంలో తమ కుమారుడు తీవ్రంగా బాధపడేవాడని, కనిపించని దెబ్బలతో ఇబ్బంది పడ్డాడని అంటున్నారు. మూడోసారి కూడా పోలీసులు స్టేషన్‌ కు పిలవడంతో భయంతో తమ కుమారుడు తిరుపతి పురుగుల మందు తాగాడని చెబుతున్నారు తల్లిదండ్రులు.


ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు


పురుగుల మందు తాగడంతో ముందుగా తిరుపతిని నెల్లూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసులు తమను అడ్డుకుని తమ కుమారుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేటు ఆస్పత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ తమ కుమారుడు మరణించాడని చెప్పారు. ఎస్సై వెంకట రమణపై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఉన్నతాధికారులు, మర్రిపాడు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. 



ఇటీవల మరో ఘటన


నెల్లూరు పోలీసుల సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ఎస్సై వెంకట రమణపై పలుమార్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విచారణ జరిపిన పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో పోలీసుల వేధింపుల కేసు మరొకటి వెలుగు చూసింది. నెల్లూలు రూరల్ మండల పరిధిలో ఓ వ్యక్తి మరణానికి ఎస్సై కారణమంటూ ఆరోపించారు టీడీపీ నేతలు. దీనికోసం చలో నెల్లూరు కార్యక్రమం కూడా చేపట్టారు. అయితే ఆ వ్యవహారంలో పోలీసులు తమ తప్పేమీ లేదని చెప్పారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ టీడీపీ నేతలు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా మర్రిపాడు ఘటనతో మరోసారి టీడీపీ నేతలు పోలీసులపై ఆరోపణలు ఎక్కుపెట్టింది. దీంతో వెంటనే పోలీసులు ఎంక్వైయిరీ మొదలు పెట్టి చర్యలు తీసుకున్నారు.