Ragging in Jayashanker University: హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులను సుమారు 20 మంది సీనియర్లు తీవ్రంగా వేదించినట్లు వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితం సీనియర్లు.. జూనియర్లు వసతి వసతి గృహంలోకి వెళ్లి వారి దుస్తులు విప్పించడంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మద్యం తాగాలని ఒత్తిడి చేయడంతో పాటు సీనియర్ల హోంవర్కులను వారితో చేయించారు. దీంతో బాధిత విద్యార్థి ఒకరు ఈనెల 25న దిల్లీలోని యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేశారు.
20 మందిపై కఠిన చర్యలు..
దీనిపై వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉన్నతాధికారులకు దిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో ఈనెల 26న ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ ర్యాగింగ్ జరిగిన విషయం ధ్రువీకరిస్తూ.. 27వ తేదీన నివేదిక సమర్పించింది. ర్యాగింగ్ రాక్షస క్రీడలో మొత్తం 20 మంది విద్యార్థులపై కథిన చర్యలు తీసుకుంటూ 28న ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న ఏడుగురిని ఓ సెమిస్టర్ పాటు తరగతుల నుంచి, డిగ్రీ పూర్తయ్యే వరకు వసతి గృహం నుంచి సస్పెండ్ చేశారు. మరో 13 మందిని వసతి గృహం నుంచి సస్పెండ్ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలిపారు. వీరు బయటి నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుందన్నారు.
అమ్మాయి మరో అమ్మయికి ప్రేమ లేఖ రాస్తూ...
సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను వేధిస్తున్న ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో వెలుగు చూసింది. ఈ విద్యాలయంలో 6 నుంచి 12 తరగతుల వరకు కేవలం విద్యార్థినులే అభ్యసిస్తుంటారు. సీనియర్ల వేధింపుల సమస్య కారణంగా గురువారం ఓ విద్యార్థిని టీసీ తీసుకోవడంతో విషయం బయటకు వచ్చింది. కొందరు జూనియర్లు తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం విద్యాలయానికి వచ్చి ఉపాధ్యాయునులతో గొడవకు దిగారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి చెందిన పలువురు విద్యార్థినులు తమను ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులు, విలేకరుల ముందే ఉపాధ్యాయునలతో చెప్పారు.
గదుల్లోకి తీసుకెళ్లి అసభ్య ప్రవర్తన..
9, 10, 11 తరగతుల బాలికలు మాట్లాడుతూ.. సీనియర్లు తమను గదుల్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న్టలు వివరించారు. చెల్లిగా ఉండాలంటూనే ఇబ్బంది కల్గించేలా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఓ విద్యార్థిని సీనియర్ రాసిన ప్రేమ లేఖను చూపారు. ప్రిన్సిపల్ స్పందిస్తూ... సమస్య ఈరోజే తన దృష్టికి వచ్చిందని చెప్పారు. సీనియర్ల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడతానని, సమస్యను పరిష్కరిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫోన్ లో ఫిర్యాదు చేశారు. ఇద్దరు ఉపాధ్యాయునులు నిత్యం విద్యార్థినులతో పాటే వసతి గృహాల్లో బస చేస్తున్నా వేధింపుల విషయం గ్రహించకపోవంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆ విద్యాలయాల సెక్టోరియల్ అధికారిని ఉన్నతాధికారులు ఆదేశించారు.