Constables Crime: మద్యం కేసులు పక్కదారి పట్టించిన కానిస్టేబుల్ కు రిమాండ్ సెబ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు మరో వ్యక్తికి న్యాయ స్థానం రిమాండ్ విధించింది. ఇటీవల నరసరావుపేట లో కోటి ముప్పై రెండు లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. మద్యం ధ్వంసం చేసేందుకు తరలిస్తుండగా కొంత మద్యాన్ని సెబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి పక్క దారి పట్టించారు.
మద్యం పక్కదారి..
పక్క దారి పట్టించి మద్యాన్ని అమ్మడానికి సబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి ప్రయత్నించారు. ఆ మద్యాన్ని ఫిరంగి పురం మండలం రేపూడి కు చెందిన చిట్టా విజయ భాస్కర రెడ్డి కి అమ్మాలంటూ అప్పగించాడు సబ్ హెడ్ కానిస్టేబుల్ యర్రం సురేంద్ర రెడ్డి. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సబ్ హెడ్ కానిస్టేబుల్ తో పాటు పక్క దారి పట్టించిన మద్యాన్ని అమ్మడానికి తీసుకున్న విజయ భాస్కర రెడ్డిని అరెస్టు చేశారు. వారిని ఎక్సైజ్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నరసరావు పేట జిల్లా కోర్టు ఆ నిందితులకు రిమాండ్ విధించింది.
అక్రమ మద్యం ధ్వంసం...
అక్రమంగా తరలిస్తున్న మద్యంపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. నిబంధనలు అతిక్రమించి తరలించే మద్యాన్ని వివిధ సందర్భాల్లో పోలీసులు పట్టుకున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వేలాది మందిపై కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అయినా మద్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది.
అక్రమ రవాణా ఎందుకు జరుగుతోంది..
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం అవసరం ఉండటంతో మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తోంది. ధరలను విపరీతంగా పెంచేశారు. దీంతో ఏపీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశా లాంటి రాష్ట్రాలతో అక్రమంగా మద్యాన్ని తరలించి ఏపీలో అమ్ముతున్నారు. ఇది సరిహద్దు గ్రామాల్లో ఉండే వారికి మంచి ఉపాధి మార్గంగా మారింది. సరిహద్దు రాష్ట్రాల్లోకి వెళ్లి అక్కడి నుండి పొలాల వెంట, చెరువుల వెంట అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. రాష్ట్రంలోకి ప్రవేశించిన మద్యాన్ని వివిధ మార్గాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దొంగ చాటున అమ్ముతున్నారు.
బ్రాండ్ మద్యం దొరకడం లేదు..
ఏపీలో బ్రాండెడ్ మద్యం దొరకడం కష్టంగా మారింది. కొత్త కొత్త బ్రాండ్లు మాత్రమే ఎక్కువగా దొరుకుతున్నాయి. అంతకుముందు దొరికిన పేరు పొందిన బీర్ల బ్రాండ్లు, విస్కీ, వైన్, రమ్ బ్రాండ్లు ఇప్పుడు దొరకడం లేదు. వాటి సరఫరాను చాలా వరకు తగ్గించేశారు. దీంతో వాటి కోసం జనాలు పాట్లు పడుతున్నారు. వాటి ధరలను విపరీతంగా పెంచేసి అక్రమంగా అమ్ముతున్నారు. చాలా మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం వస్తున్నా.. దించి దించగానే అవి మాయం అవుతున్నాయి. వాటిని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు.