Israel Gaza War: విద్వేషం పాలించే దేశం ఉంటుందా..? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా..? అని ఓ పాటలో రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దాదాపు రెండేళ్లుగా జరుగుతోంది. ఏడాదిగా ఇజ్రాయేల్, హమాస్ వార్ కొనసాగుతోంది. ఈ రెండు యుద్ధాల్లోనూ మిగిలింది విధ్వంసమే. యుద్ధాలకు కారణం విద్వేషమే. రెండు వర్గాలూ సాధించింది ఏమీ లేదు. ఆత్మరక్షణ పేరుతో జరుగుతున్న అరాచకమిది. రెండు దేశాల సైన్యాలు కొట్టుకుంటే మధ్యలో వేలాది మంది సామాన్యులు సమిధలవుతున్నారు. బలి అవుతున్న వాళ్లలో అప్పుడే కళ్లు తెరిచిన పసికందుల నుంచి కాటికి కాలు చాపిన పండు ముసలి వరకూ ఉన్నారు. కానీ...మృతుల్లో చిన్నారుల సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఇజ్రాయేల్, హమాస్ యుద్ధం ఈ రక్తచరిత్ర రాస్తోంది. గాజాలోని స్కూల్స్‌ని టార్గెట్‌గా చేసుకుని ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. ఇళ్లలో హమాస్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నెపంతో గగనతలం నుంచి మిజైల్స్ వర్షం కురిపిస్తోంది. ఈ దాడుల్లో ఎంతో మంది సాధారణ పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి ఫొటోలు, వీడియోలు అంతర్జాతీయంగా అందరి హృదయాల్నీ కలిచివేస్తున్నాయి. ఇలా మనసు కదిలించే విషాదం ఒకటి జరిగింది. ఈ ఒక్క ఫొటో అక్కడి విధ్వంసానికి అద్దం పట్టింది. 



(Image Credits: GettyImages)


ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు మహమ్మద్ అబు అల్ కుస్మన్. గాజాలోని దీర్ అల్ బలాహ్‌లో కుటుంబంతో సహా ఉంటున్నాడు. ఎప్పుడెప్పుడు ప్రాణాలు పోతాయో తెలియని ఇంత విధ్వంసంలోనూ అతనికో మంచి జరిగింది. నాలుగు రోజుల క్రితం అబు అల్ దంపతులకు ఇద్దరు కవలలు పుట్టారు. అప్పటి వరకూ ఉన్న బాధ, ఆందోళన అంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. చాలా సంతోషపడ్డాడు. వెంటనే ఇద్దరు పిల్లలకూ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకోవాలని లోకల్ ఆఫీస్‌కి వెళ్లాడు. ఇంతలోనే గుండె పగిలిపోయే వార్త అందింది. తన ఇంటిపైన బాంబు దాడి జరిగిందని తెలిసింది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూస్తే శిథిలాలు, శవాలు తప్ప ఏమీ మిగల్లేదు. పిచ్చి పట్టిన వాడిలా అక్కడికి వచ్చిన వాళ్లందరినీ పట్టుకుని గట్టిగా ఏడ్చేశాడు. కవలలతో పాటు భార్య కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు "నా" అని చెప్పుకోడానికి అబు అల్‌కి ఒక్కరూ మిగల్లేదు. కన్నీరు ఇంకే వరకూ ఏడ్చాడు. "ఇదిగో ఇప్పుడే బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చాను. వీటిని ఏం చేసుకోను" అంటూ ఆ సర్టిఫికేట్స్ చూపిస్తూ అడుగుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం ఎవరి తరమూ కాలేదు. 


ఇది కేవలం అబు అల్ కథే కాదు. ఇలా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని కోల్పోయి జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. ఇప్పటి వరకూ 115 మంది పసికందులు ఈ యుద్ధానికి బలి అయినట్టు అక్కడి హెల్త్ మినిస్ట్రీ ఇటీవలే లెక్కలు వెల్లడించింది. ఇజ్రాయేల్ ఆర్మీని ఎంత మంది నిలదీసినా ఏ ఒక్క ప్రశ్నకీ బదులు రావడం లేదు. "హమాస్‌ ఉగ్రవాదులున్న స్థావరాలే మా లక్ష్యం" అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఈ పసికందులు ఉగ్రవాదులా..? వీళ్లేం తప్పు చేశారు..? అని సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు కంఠశోషకు తప్ప ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. 


Also Read: Kolkata Doctor Case: కూతురి డెడ్‌బాడీ చూసేందుకు 3 గంటల ఎదురు చూపులు, కోల్‌కత్తా డాక్టర్‌ తల్లిదండ్రుల నరకయాతన