Kolkata Trainee Doctor Murder Case: కోల్‌కత్తా డాక్టర్ హత్యాచారం కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉందని ఓ వైద్యుడు వెల్లడించాడు. ఓ టీవీ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు. అత్యాచారం జరిగిన తీరు చూస్తుంటే కేవలం ఒకరే ఈ దారుణానికి పాల్పడినట్టు అనిపించడం లేదని తేల్చి చెప్పాడు. శరీరంపై ఉన్న నమూనాలు సేకరించిన తరవాత ఈ ధ్రువీకరణకు వచ్చినట్టు వివరించాడు. కుటుంబ సభ్యులు కూడా సామూహిక అత్యాచారం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు డాక్టర్ కూడా అదే విషయం చెప్పడం ఈ కేసుని మరో మలుపు తిప్పింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 


"బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందన్న అనుమానాలున్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఇదే చెబుతోంది. శరీరంపై ఉన్న నమూనాలను సేకరించి చూశాం. దీన్ని బట్టే సామూహిక అత్యాచారం జరిగిందని అనుకుంటున్నాం. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానాలు వ్యక్తం చేశారు"


- వైద్యుడు
 
కోల్‌కత్తాలోని ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్ డెడ్‌బాడీ సెమినార్ రూమ్‌లో అర్ధనగ్నంగా కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఈ కేసులో సంజయ్ రాయ్ అనే అనుమానితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. వైద్యురాలిని అత్యంత దారుణంగా హింసించి చంపినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వెల్లడించింది. జననాంగంలో లోతైన గాయమైనట్టు తేలింది. మొత్తం నాలుగు పేజీల పోస్ట్‌మార్టం రిపోర్ట్‌..ఆమె ఎంత నరకయాతన అనుభవించి చనిపోయిందో వివరించింది. 


Also Read: Kolkata Doctor Case: కూతురి డెడ్‌బాడీ చూసేందుకు 3 గంటల ఎదురు చూపులు, కోల్‌కత్తా డాక్టర్‌ తల్లిదండ్రుల నరకయాతన