Viral News in Telugu: అయోధ్యలో భారీ దొంగతనం జరిగింది. భక్తిపథ్, రామ్‌ పథ్‌లో రూ.50 లక్షల విలువైన ప్రొజెక్టర్ లైట్స్‌తో పాటు వేలాది వెదురు బొంగులు చోరీ చేశారు. భారీ భద్రత ఉండే అయోధ్యలోనే ఇంత పెద్ద దొంగతనం జరగడం సంచలనమవుతోంది. పోలీసులే ఈ విషయం వెల్లడించారు. దాదాపు 4 వేల లైట్స్‌ని దొంగలు ఎత్తుకుపోయినట్టు తెలిపారు. రామ్ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే FIR నమోదైంది. ఆగస్టు 9వ తేదీన ఈ కేసు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. లైటింగ్‌ని కాంట్రాక్ట్‌ తీసుకున్న సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రామ్‌ పథ్‌లో దాదాపు 6,400 బాంబూ లైట్స్‌ని ఏర్పాటు చేశారు.


భక్తి పథ్‌లో 96 ప్రొజెక్టర్ లైట్స్ అమర్చారు. మార్చి 19వ తేదీ వరకూ ఇవి అక్కడే ఉన్నాయి. అయితే..మే 9వ తేదీన అధికారులు ఇక్కడ తనిఖీలు నిర్వహించగా ఏవీ కనిపించలేదు. అన్నీ చోరీకి గురైనట్టు గుర్తించారు. 3,800 బాంబూ లైట్స్‌తో పాటు 36 ప్రొజెక్టర్ లైట్స్‌ని దొంగలు ఎత్తుకెళ్లారు. మే నెలలోనే ఇది గుర్తించినప్పటికీ ఆగస్టు 9వ తేదీన FIR నమోదైంది. ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామ మందిరం ప్రారంభమైంది. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తరవాత అయోధ్యకి భక్తుల తాకిడి పెరిగింది.