Hyderabad latest News: చదువుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్న విద్యార్థినుల పట్ల కండక్టర్ పరుషంగా ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ బస్సు కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని షాద్ నగర్ బస్ డిపో ముందు విద్యార్థినులు ధర్నాకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలం లోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసి బస్సు నడుస్తుంది. ఇదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థి, విద్యార్థినిలు చదువు కోసం షాద్ నగర్ ప్రాంతానికి వస్తుంటారు. అయితే విద్యార్ధినుల పట్ల రాములు అనే బస్ కండక్టర్ పరుషంగా మాట్లడుతూ బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు.
ఆధార్ అప్ డేట్ లేకపోయినా, బ్యాగ్ లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమయినా బండబూతులు తీట్టి మధ్యలోనే బస్ ను ఆపి దింపేస్తున్నాడని వాపోయారు. ఈ రోజు సంగెం గ్రామానికి వచ్చిన బస్ లోనే విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లి తండ్రులు షాద్ నగర్ బస్ డిపో వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల అసభ్య పదజాలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న బస్ కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిపో మేనేజర్ కు ఫిర్యాదు చేశారు.