Fatal Accident In Jaipur: రాజస్థాన్(Rajasthan) రాజధాని జైపూర్(Jaipur)లో ఘోర ప్రమాదం జరిగింది. అజ్మీర్-జైపూర్ జాతీయ రహదారి(Highway)పై ఓ ఆయిల్ ట్యాంకర్(Oil Tanker)ను సీఎన్‌జీ(CNG) ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం.. సమీపంలో ఉన్న పెట్రోల్ బంకులోకి దూసుకుపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించి.. అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా.. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన స్పందించి.. బాధితులను ఆసుపత్రికి తరలించి.. వైద్య చికిత్సలు అందించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సైతం ఈ ప్రమాద ఘటనపై స్పందించారు. ముఖ్యమంత్రి భజనలాల్ శర్మతో ఫోన్‌లో మాట్లాడి.. పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఏం జరిగింది?
రాజస్థాన్‌లోని జైపూర్‌లో శుక్రవారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. దీని కారణంగా సంభవించిన పేలుడుతో సుమారు ఎనిమిది మంది మృతి చెందారు. 40 మందికిపైగా గాయపడ్డారు. జైపూర్‌లోని అజ్మీర్ జాతీయ రహదారి సమీపంలో ఒక CNG ట్రక్కు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ వాహనం సమీపంలోని పెట్రోల్‌బంకులోకి దూసుకుపోయింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనం కాగా, 40 మందికి గాయాలయ్యాయి. అంతే కాదు 40 వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. ఈ వాహనాల్లో ప్రయాణీకులు ప్రాణాలతో బయట పడ్డారు.
తెల్లవారుజామున ఘటన
జైపూర్‌లోని భంక్రోటా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 5.00 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి అగ్నిమాపక శాఖ వాహనాలను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చాలా భయంకరంగా ఎగిసి పడడంతో అగ్నిమాపక శాఖకు చెందిన పలు వాహనాలు గంటల తరబడి మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ మంటల్లో చిక్కుకుని పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదయ్యాయి.
Also Read: రోడ్డుపై అమ్మాయిల కోట్లాట వీడియో వైరల్, భాయ్ ఫ్రెండ్ కోసమేనంటోన్న నెటిజన్స్
పొగ మంచే కారణమా?
అజ్మీర్ జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కురవడంతో రాకపోకలకు రహదారి కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో హైవేపై వెళ్లే వాహనాలు వేగాన్ని తగ్గించాల్సి ఉంది. కానీ, CNG ట్రక్కు వేగంగా వెళ్లి.. ఓ ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారీ పేలుడు సంభవించి మంటలు చుట్టుపక్కల వ్యాపించాయి. సీఎన్‌జీ వాహనం సమీపంలోని పెట్రోల్ బంకులోకి దూసుకుపోవడంతో ప్రమాదం మరింత పెరిగింది. కాగా. ఎగిసి పడుతున్న మంటలను ఆర్పేందుకు 20కి పైగా అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. ఇదిలా ఉండగా, ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ ప్రమాదంలో కాలిపోయిన వాహనాల్లో అనేక ట్రక్కులు, ప్యాసింజర్ బస్సులు, గ్యాస్ ట్యాంకర్లు, కార్లు, పికప్‌లు, బైక్‌లు, టెంపోలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఘటనా స్థలికి సీఎం
జైపూర్ - అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ఘోర ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి(Chief minister) భజన్ లాల్ శర్మ(Bhajan Lal Sharma) హుటాహుటిన స్పందించారు. వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై పూర్తి సమాచారం తెలుసుకున్నారు. బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర హోం మంత్రి(Central home minister) అమిత్‌షా(Amit shah) కూడా ఈ ఘటనపై స్పందించారు. సీఎంకు ఫోన్ చేసి పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Also Read: ఐదేళ్లకే పోలీస్ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?