Trouble mounts for Siddaramaiah as ED likely to probe Karnataka CM in MUDA land scam : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీకి సంబంధిచిన భూుల విషయంలో సిద్ధరామయ్య భార్యకు అదనంగా ప్రయోజనం కల్పించారన్న అంశంపై ఇప్పటికే లోకాయుక్త విచారణకు గవర్నర్ అనుమతించారు. దాన్ని హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో లోకాయుక్త పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఏ వన్ గా చేర్చారు.
సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన సిద్దరామయ్య
అయితే ఈ కేసులో ఎక్కడ సీబీఐ వస్తుందోనని ఆందోళన పడుతున్న సిద్ధరామయ్య.. కర్ణాటకలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈడీకి ఎలాంటి జనరల్ కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తనకు ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి విచారణ చేయవచ్చు. ఇప్పుడు ముడా భూముల కేసులో ఈడీ విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ముడా భూములను అక్రమంగాపొందారని ఆరోపణలు
మైసూర్ నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి భార్య పార్వతి నుంచి భూమి సేకరించింది ముడా అధికారగణం. ఆమె భూమి కోల్పోయిన గ్రామంలో కాకుండా మైసూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 14 స్థలాలను కేటాయించడం అసలు వివాదానికి కేంద్రంగామారింది. దీనిపై ముగ్గురు సామాజిక కార్యకర్తలు గవర్నర్‌కి పిటిషన్ సమర్పించారు. దీని ఆధారంగా సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపడంతో రాజకీయ కలకలం ప్రారంభమయింది. గవర్నర్ ఉత్తర్వులు చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘించిందని, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాతో సహా రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించిందని సిద్ధరామయ్య హైకోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది.
న్యాయపోరాటం చేస్తానంటున్న సిద్దరామయ్య
ముడా స్కామ్‌లో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే ప్రకటించారు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటానని సిద్ధరామయ్య ప్రకటించారు. సీబీఐ రాకుండా ఆపగలిగారు కానీ.. ఈడీ రాకుండా చేయడం ఆయన వల్ల కాదు. కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి పెరిగిపోయింది .ఇప్పుడు సీఎంపై ఈడీ కేసు నమోదయితే.. ఇంకా ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది.