గ్లోబల్ సార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎలా ఉండాలి? సినిమా చూడటానికి థియేటర్లలోకి వచ్చిన ఆడియన్స్ చేత, మరీ ముఖ్యంగా మెగా అభిమానుల చేత స్టెప్పులు వేయించేలా ఉండాలి. మాంచి మాస్ నంబర్ ఇవ్వాలి. అందులోనూ దర్శకుడు శంకర్ సినిమాలో సాంగ్స్ అంటే... సంగీత దర్శకుడు ఎస్ తమన్ మ్యూజిక్ అంటే... అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా 'రా రా మచ్చా' ఉందని చెప్పాలి.
నీలాంటి వాడినే... నీలాంటి వాడినే!
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). ఇందులో ఆల్రెడీ ఓ సాంగ్ రిలీజ్ చేశారు. 'జరగండి జరగండి...' అంటూ వచ్చిన ఆ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు రెండో సాంగ్, సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ విడుదల చేశారు.
'రా మచ్చా మచ్చా...' (Raa Macha Macha Song) అంటూ సాగే ఈ పాటకు తమన్ మాంచి మాస్ బీట్ ఇవ్వగా... నకాష్ అజీజ్ అంటే ఎనర్జీతో పాడారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జానపద నృత్య రీతులు, లోకల్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ వినిపించేలా ఈ పాటను రూపొందించారు.
తెలుగు, తమిళ భాషల్లో 'రా మచ్చా మచ్చా...' అంటూ సాగే ఈ పాటను హిందీలో 'ధమ్ తు దికాజా...' పేరుతో విడుదల చేశారు. ఆల్రెడీ విడుదలైన ఈ సాంగ్ కొన్ని క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడినే... షర్టు పైకి పెడితే నీలాంటి వాడినే' అంటూ తెలుగులో అనంత్ శ్రీరామ్ పాట రాశారు. హీరో ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత స్నేహితులను కలిసే సందర్భంలో ఈ సాంగ్ వస్తుందని తెలిపారు.
'రా మచ్చా మచ్చా' పాటలో ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో డాన్స్ చేయటం విశేషం. ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల జానపద కళాకారులు భాగం కావడం విశేషం. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు... పశ్చిమ బెంగాల్‌కు చెందిన చౌ... ఒరిస్సాలోని గుమ్రా, రానప్ప, పైకా, దురువ... కర్ణాటలోని హలారి. ఒక్కలిగ, గొరవర, కుణిత... నృత్య రీతులను ఈ పాటలో భాగం చేశారు. ఈ పాటకు గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. తమిళంలో వివేక్, హిందీలో కుమార్ సాహిత్యం అందజేశారు.
క్రిస్మస్ బరిలో 'గేమ్ ఛేంజర్' విడుదల!
శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సంస్థలపై 'దిల్' రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో కియారా అడ్వాణీ హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read: థియేటర్లలోకి ఈ వారం సందడి - ఒక్క శుక్రవారమే 8 తెలుగు సినిమాలు, ఇంకా...