Tripura CM Swearing-In:


మార్చి 8న ప్రమాణ స్వీకారం 


ఇటీవల జరిగిన ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో మరోసారి బీజేపీ హవా కొనసాగింది. త్రిపుర, నాగాలాండ్‌లో స్పష్టమైన మెజార్టీతో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. త్రిపురలో ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. త్రిపుర బీజేపీ అధ్యక్షుడు రాజిబ్ భట్టచర్జీ ఈ విషయం వెల్లడించారు. మార్చి 8వ తేదీన ప్రభుత్వం ఏర్పాటవనున్నట్టు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నట్టు స్పష్టం చేశారు. 


"మార్చి 8 వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా అమిత్‌షా, జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశ నలు మూలల నుంచి ప్రజలు వచ్చి ఘనంగా అదే రోజున హోలి వేడుకలు జరుపుకుంటారు" 


- రాజిబ్ భట్టచర్జి,  త్రిపుర బీజేపీ అధ్యక్షుడు 




త్రిపురలో మరోసారి బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలుపొందింది. 39% ఓటు షేర్‌తో 32 చోట్ల విజయం సాధించింది.  తిప్ర మోత పార్టీ 13 స్థానాలు దక్కించుకుని రెండో స్థానంలో నిలిచింది. CPI 11 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ మాత్రం మూడు స్థానాలకే పరిమితమైంది. IPFT ఓ చోట గెలిచింది. ఇప్పటికే సీఎం మాణిక్ సాహా గవర్నర్ సత్యదియో నరైన్ ఆర్యకు తన రాజీనామా లేఖను సమర్పించారు. అగర్తలలోని వివేకానంద గ్రౌండ్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. 


హామీల వర్షం..


మేనిఫెస్టో విడుదల చేసినప్పటి నుంచి త్రిపురలో భారీ మెజార్టీతో గెలుస్తామని బీజేపీ చాలా ధీమాగా ఉంది. "ఇది కేవలం కాగితం కాదు. ప్రజల పట్ల మాకున్న నిబద్ధతకు నిదర్శనం" అని తేల్చి చెప్పారు నడ్డా. ఒకప్పుడు త్రిపుర పేరు చెబితే హింసాత్మక వాతావరణమే గుర్తొచ్చేదని... ఇప్పుడు ఈ రాష్ట్రం శాంతి, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. "త్రిపురలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్‌లు ఇచ్చాం. ఇందుకోసం రూ.107 కోట్లు ఖర్చు చేశాం" అని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులన్నింటినీ ప్రస్తావించారు. ఐదేళ్లలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద 3.5 లక్షల ఇళ్లు కట్టించి ఇచ్చామని గుర్తు చేశారు. జల్ జీవన్ మిషన్ కింద అందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించామని చెప్పారు. 2018లో కేవలం 3% ఇళ్లలో మాత్రమే తాగు నీటి సౌకర్యం ఉండేదని...బీజేపీ ఆ సంఖ్యను 55%కి పెంచిందని వెల్లడించారు. త్రిపుర ప్రజల తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు జేపీ నడ్డా. అనుకూల్ చంద్ర స్కీమ్‌లో భాగంగా రూ.5 కే అందరికీ భోజనం అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అభివృద్ధి విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఈ హామీల వర్షం కురిపించి ఓట్లు రాబట్టుకోవడంలో సక్సెస్ అయింది బీజేపీ. 


Also Read: Cough Syrup Death: కాఫ్ సిరప్ కేసులో కేంద్రం మరో కీలక నిర్ణయం, కంపెనీ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశాలు