Cough Syrup Case:


లైసెన్స్ రద్దు..


నోయిడాకు చెందిన  Marion Biotech కంపెనీ లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ కేంద్రం యూపీ డ్రగ్ కంట్రోలింగ్ అండ్ లైసెన్స్ అథారిటీకీ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన కాఫ్ సిరప్‌ వల్ల ఉజ్బెకిస్థాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే కేంద్రం చాలా సీరియస్‌గా ఉంది. WHO ఈ ఆరోపణలు చేసిన వెంటనే అప్రమత్తమై విచారణ మొదలు పెట్టింది. ఆ తరవాత ఆ సంస్థకు చెందిన తయారీ ల్యాబ్‌లను మూసేసింది. ఆ శాంపిల్స్‌ను సేకరించింది. మొత్తం 36 డ్రగ్ శాంపిల్స్‌ను టెస్ట్ చేసిన అధికారులు అందులో 22 శాంపిల్స్‌లో టాక్సిన్స్‌ ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే పోలీసులు ఈ సంస్థకు చెందిన ముగ్గురు అధికారులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు డైరెక్టర్లు పరారీలో ఉన్నారు. అయితే మరో ఇండియన్ కంపెనీ  Maiden Pharmaceuticals తయారు చేసిన సిరప్‌ల కారణంగా ఈ మరణాలు సంభవించాయన్న వాదన కూడా ఉంది. ఇదే విషయాన్ని WHO వెల్లడించింది. ఈ సిరప్ శాంపిల్స్‌ని టెస్ట్ చేయగా వాటిలో ప్రమాదకరమైన ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించింది. ఉజ్బెకిస్థాన్‌తో పాటు కిర్జిస్థాన్, కంబోడియాకు కూడా ఇవే సిరప్‌లను ఎగుమతి చేస్తున్నట్టు తేలింది. ఈ కేసు విచారణలో ఉన్న ఓ అధికారి మాత్రం ఈ సిరప్‌ను చాలా దేశాలకు ఎగుమతి చేసినట్టు చెబుతున్నారు. 


"మేరియన్ కంపెనీ తయారు చేసిన డ్రగ్స్‌ను చాలా దేశాలకు ఎగుమతి చేశారు. అక్కడి పిల్లలకు ఏమీ కాకూడదని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్య శాఖ హెల్త్ అలెర్ట్ ప్రకటిస్తే మంచిది. ఈ నిర్ణయం తీసుకోవడమే మంచిది. ఇలా అలెర్ట్ చేయడం వల్ల ఆయా దేశాల్లోని ప్రజలు ఆ సిరప్‌ను వాడకుండా ఉంటారు." 


-అధికారి 


WHO చెప్పిన లెక్కల ప్రకారం..గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్‌లో ఐదేళ్ల లోపు చిన్నారులు 300 మంది వరకూ మృతి చెందారు. ఈ నకిలీ మందుల కారణంగా కిడ్నీలపై ప్రభావం పడిందని తేల్చి చెప్పింది. ఇప్పటికే యూపీ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDSA) విభాగం ఆ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. డ్రగ్ రికార్డ్‌లు సరిగా మెయింటేన్ చేయకపోవడంతో పాటు మందు తయారీకి ఏయే పదార్థాలు వినియోగిస్తున్నారన్న వివరాలు సరైన విధంగా అందించలేదు. అందుకే లైసెన్స్ రద్దు చేశారు అధికారులు. ఘజియాబాద్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఈ మేరకు కీలక విషయాలు వెల్లడించారు. ఫేజ్‌ -3 లోని Marion Biotech Pvt Ltd కంపెనీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని...సంస్థ డైరెక్టర్లు జయ జైన్, సచిన్ జైన్, ఆపరేషన్ హెడ్ తుహిన్ భట్టాచార్యపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టంలోని 17,17A,17-B సెక్షన్ల కింద FIR నమోదు చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి పోలీసులు తుహిన్ భట్టాచార్య, అతుల్ రావత్, మూల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న కంపెనీ యజమాని కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతడినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.