Rains In Andhra Pradesh And Telangana: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వర్షం పడబోతోందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి(బుధవారం ) నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని పేర్కొంది. నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ , అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాల ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం కారణంగా విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 3 రోజులపాటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కుమ్మేస్తాయని హెచ్చరిస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతోనే మూడు రోజులపాటు రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. వీటితోపాటు కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా ఓ మోస్తరు వానలు పడతాయి. కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి వరి కోతలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు. ఇతర వ్యవసాయ పనులు చేసుకునే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ వెదర్ ( Telangana Latest Weather)
బంగాళాఖాతంలో మార్పులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. ఎల్లుడి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతున్నాయి.
హైదరాబాద్‌లో వెదర్ ( Hyderabad Latest Weather)
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచు పడుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటే కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. ఉపరితల గాలులు ఈశాన్య తూర్పు దిశలో గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్టఉష్ణోగ్రత 31 డిగ్రీలు, కనిష్ణ ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలు, గాలిలో తేమ శాతం 60 శాతం నమోదు అయింది.