AIIMS Rishikesh Video: క్రైమ్ చేసిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇది చాలా కామన్. కానీ...నేరం పెద్దదైనప్పుడు, అది ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ముందు వెనకా ఆలోచించకుండా దూసుకుపోయి జీప్ ఎక్కించి తీసుకెళ్లిపోవడమే కాస్త డిఫరెంట్. ఉత్తరాఖండ్‌లో ఇదే జరిగింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న AIIMS డాక్టర్‌ని హాస్పిటల్‌ వార్డ్‌లోకి జీప్‌తో సహా వెళ్లి మరీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళా డాక్టర్‌ని లైంగికంగా వేధించిన కేసులో నిందితుడిని పట్టుకోడానికి ఇలా సినిమా స్టైల్‌లో వార్డులోకి దూసుకొచ్చారు పోలీసులు. ఎమర్జెన్సీ వార్డ్‌లో చుట్టూ పేషెంట్స్‌ ఉన్నా అదేమీ పట్టించుకోకుండా జీప్‌లోనే వెళ్లిపోయారు. కొంత మంది సెక్యూరిటీ వచ్చి పేషెంట్స్‌ని పక్కకు జరిపి పోలీస్ వెహికిల్‌కి రూట్ క్లియర్ చేశారు. AIIMS Rishikesh లో జరిగిందీ ఘటన. 




పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ నర్సింగ్ ఆఫీసర్ ఆపరేషన్ థియేటర్‌లో మహిళా వైద్యురాలిని లైంగికంగా వేధించాడు. అంతే కాదు. ఆ లేడీ డాక్టర్‌కి అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడు. ఈ ఘటనతో వైద్యులందరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వేధింపులను ఖండిస్తూ వెంటనే స్ట్రైక్ చేపట్టారు. నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ తరవాత పోలీసులను ఆశ్రయించారు. వైద్యులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడం వల్ల అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే జీప్‌లోనే వార్డులోకి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వైద్యులంతా ఒక్కసారిగా చుట్టుముట్టారు. నిందితుడిని వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినదించారు.