Tirumala News: ఏడుకొండల వాడు వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. వైకుంఠం క్యూ కాంప్లెక్సులో వద్ద చేస్తున్న భక్తుల తనిఖీల్లో నిఘా సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు మొబైల్ ఫోన్ తో ప్రవేశించాడు. శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తున్న సమయంలో ఆలయాన్ని చిత్రీకరించాడు. సెల్ ఫోన్ లో పలు వీడియోలు, ఫొటోలు తీశాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి మొబైల్ ఫోన్ లో చిత్రికరించాడు. అంతేకాకుండా శ్రీవారి ఆలయంలోని పలు ఉప ఆలయాలను కూడా ఫొటోలు తీశాడు. స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ భక్తుడు తిరిగి వెళ్లిపోయాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
ఏప్రిల్ 25వ తేదీన తిరుమలలో చక్కర్లు కొట్టిన హెలికాప్టర్
తిరుమలలో హెలికాఫ్టర్ లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. శ్రీవారి ఆలయంపై మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ గా టీటీడీ ప్రకటించింది. హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడంపై అప్రమత్తమైన టీటీడీ.. విచారణ చేపట్టింది. అయితే తిరుమలపై చక్కర్లు కొట్టిన హెలికాప్టర్లు ఏయిర్ పోర్స్ విభాగానికి చెందినవిగా గుర్తించారు. కడప నుంచి చెన్నైకి వెళ్లే సమయంలో తిరుమల మీదుగా ప్రయాణించినట్లు సమాచారం.
మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు
శ్రీవారి ఆలయం పరిసరాల్లో మూడు హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో భక్తులను ఆందోళనకు గురైయ్యారు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, పరాకమణి భవనం, బాలాజీనగర్ ప్రాంతంలో హెలికాప్టర్‌లు చక్కర్లు కొట్టినట్లు అధికారులు గుర్తించారు. తిరుమలలో 3 హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లు కడప నుంచి చెన్నై వెళ్తుండగా తిరుమల మీదుగా చక్కర్లు కొట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
గతంలో డ్రోన్ కలకలం
తిరుమల శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఓ వీడియో ఇటీవల నెట్టింట హల్ చల్ చేసింది. ఈ వీడియో వైరల్ అవడంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాల్లో శ్రీవారి ఆలయాల చిత్రీకరించడంపై ఆరా తీశారు. తిరుమల శ్రీవారి ఆలయంపై, పరిసర ప్రాంతాల్లో విమానాలు, డ్రోన్ కెమెరాలు నిషేధం ఉంది. అయితే శ్రీవారి ఆలయానికి సంబంధించిన వీడియాను ఓ యూట్యూబ్ ఛానల్ పోస్టు చేయడం కలకలంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంపై శ్రీవారి భక్తులు, ఆగమ సలహాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగమశాస్ర్త నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురం చిత్రీకరణకు అనుమతులు లేవని టీటీడీ తెలిపింది. శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన విజువల్స్ పై విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు. హైదరాబాద్ కు చెందిన వారు విజువల్స్ ని అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. వీళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.