Crime News: తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడు బాబు స్వామి దంపతులపై పోలీసులు కేసు నమోదు చేయడం తిరుపతి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తిరుచానూరుకి చెందిన నితిన్ అనే యువకుడు తన ఆత్మహత్యకు బాబు స్వామి దంపతులే కారణమంటూ లేఖ రాసి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాను చీటీ వేసిన డబ్బులు ఇవ్వకుండా మూడు సంవత్సరాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అది భరించేలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న బాబు స్వామి.. తన భార్య వాణితో పాటు ఇంటికి తాళం వేసి మరీ పరారయ్యాడు. నితిన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాబు స్వామి దంపతులపై కేసు నమోదు చేశారు. వాళ్లను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


శ్రీనివాసుడు దేవేరైనా పద్మావతి అమ్మవారు వెలిసిన తిరుచానూరు ఆలయ ప్రధాన అర్చకుడు ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయంలో ప్రధాన అర్చక పదవిలో కొనసాగుతూనే బాబు స్వామి ప్రైవేట్ గా చీటీల వ్యాపారాన్ని ప్రారంభించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో చీటిల వ్యాపారంలో నష్టాలు రావడంతో బాబు స్వామి కొందరికి చీటి డబ్బులు ఇవ్వనట్లు సమాచారం. దీంతో చీటి డబ్బులు ఇవ్వకుండా గత మూడేళ్లుగా పలువురుని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. తిరుచానూరు పంచాయతీ ఎస్వీపీ కాలనీకి చెందిన నితిన్ స్థానికంగా ప్రొవిజన్ దుకాణం నడుపుతూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే తన అవసరాల నిమిత్తం ఇంటి పరిసరాల్లో నమ్మకంగా చీటిలు నిర్వహిస్తున్న వాణి, ఆమె భర్త ప్రతాప్ స్వామి అలియాస్ బాబు స్వామి వద్ద పెద్ద మొత్తంలో చీటీలు వేశాడు. చీటీ గడువు ముగిసి మూడేళ్లు గడుస్తున్నా తనకు రావాలిసిన డబ్బులు ఇవ్వకుండా దంపతులు ఇద్దరు రోజుకో మాట చెబుతుండడంతో అడిగి అడిగి విసిగి వేసారిన నితిన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 


సూసైడ్ నోట్ చూసి బాబు స్వామి దంపతులపై కేసు నమోదు చేసిన పోలీసులు


ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. తన చావుకు కారణం చీటి నిర్వహిస్తున్న దంపతులే కారణమంటూ లేఖ రాసి మూడు రోజుల క్రితం తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు సోమవారం తిరుచానూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాకు తరలించారు. అనంతరం అక్కడే దొరికిన సూసైడ్ నోట్ తీసుకొని... నితిన్ చావుకు కారణమైన చీటి నిర్వాహకులు వాణి, ఆమె భర్త బాబు స్వామి పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలుసుకున్న నిందితులు ఇద్దరు ఇంటికి తాళం వేసి పరారయ్యరు. దీంతో పోలీసులు వీరు ఇరువురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి 48 గంటలు గడుస్తుండడంతో ఆలయ ప్రధాన అర్చకుడైన బాబు స్వామిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.