Hindu Holocaust Memorial: 'హిందువుల మద్దతుతోనే అప్పుడు గెలిచా- మళ్లీ అధికారంలోకి వస్తే'

ABP Desam Updated at: 28 Oct 2022 11:12 AM (IST)
Edited By: Murali Krishna

Hindu Holocaust Memorial: ఫ్లోరిడాలో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు.

(Image Source: PTI)

NEXT PREV

Hindu Holocaust Memorial: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఫ్లోరిడాలో రిపబ్లికన్ హిందూ కూటమి (ఆర్‌హెచ్‌సీ) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 







మాకు హిందూ జనాభా నుంచి రెండు సార్లు (2016, 2020) ఎన్నికల్లో గొప్ప మద్దతు లభించింది. భారత ప్రజలు ఎప్పుడూ నాకు మద్దతు పలుకుతూనే ఉన్నారు. కీలకమైన రాష్ట్రాల్లో హిందూ ఓటర్లు అందించిన మద్దతుతోనే నేను 2016లో అధ్యక్ష పీఠం అధిరోహించాను. వాషింగ్టన్ డీసీలో హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని నిర్మించాలనే ఆలోచనను నేను పూర్తిగా ఆమోదించాను. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానిని పూర్తి చేస్తాం.   2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నేను గెలిస్తే భారత్‌- అమెరికా సంబంధాలను మరో స్థాయికి తీసుకువెళ్తాను. నేను నెగ్గితే ఆర్‌హెచ్‌సీ వ్యవస్థాపకుడు శలభ్‌కుమార్‌ను భారత్‌లో అమెరికా రాయబారిగా నియమిస్తాను. అయితే పోటీ చేసే విషయంలో నేనింకా నిర్ణయం తీసుకోలేదు.                                                            - డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


పరువునష్టం దావా


ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై కోర్టులో ఇటీవల పరువు నష్టం దావా వేశారు డొనాల్డ్ ట్రంప్. తనపై సీఎన్‌ఎన్‌ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ట్రంప్ ఆరోపించారు.


సీఎన్‌ఎన్ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని దెబ్బతీసేలా సీఎన్‌ఎన్‌ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ట్రంప్ అన్నారు. తన పరువుకు భంగం కలిగించినందున సీఎన్ఎన్.. 475 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,867.71 కోట్లు) పరిహారాన్ని ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు.


దాని వల్లే


2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో 'ది బిగ్‌ లై' పేరిట సీఎన్‌ఎన్‌ ప్రచారం నిర్వహించిందని ట్రంప్ అన్నారు. దీని వల్ల తనకు ఆ ఎన్నికల్లో నష్టం కలిగిందని ట్రంప్ అన్నారు. 


" 'ది బిగ్‌ లై' పేరిట సీఎన్‌ఎన్‌ జరిపిన దుష్ప్రచారంలో దాదాపు 7,700 సార్లు నా గురించి ప్రస్తావించారు. ప్రజల్ని భయ పెట్టడానికే వాళ్లు అలా చేశారు. ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్న మరికొన్ని ఛానళ్లపై కూడా నేను దావా వేస్తాను. నేను మళ్లీ అధ్యక్ష బరిలో నిలుస్తున్నానే భయంతోనే సీఎన్‌ఎన్‌ దుష్ప్రచారం చేస్తోంది. "
-                                      డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


Also Read: Putin Praises Modi: మోదీ నిజమైన దేశభక్తుడు, భారత్‌ను గౌరవించే స్థాయికి తీసుకెళ్లారు - పుతిన్‌ ప్రశంసలు

Published at: 28 Oct 2022 11:04 AM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.