Tiger Wandering in AP: పార్వతీపురం మన్యం జిల్లాలో పులి సంచారం కలకలం సృష్టించింది. పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ బుచ్చింపేట గ్రామంలో సమీపంలో ఒ మేకపై దాడి చేసింది. ఈ ఘటనలో మేక మృతి చెందినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని స్థానికులు.. వైద్యులకు, అటవీశాఖ అధికారులకు తెలిపారు. రంగంలోకి దిగిన అధికారులు పులి గురించి వెతుకులాట ప్రారంభించారు. అయితే డోకిశీల పంచాయతీ గ్రామాలకు స్థానికంగా ఉన్న జాంతికొండ పై పులి సంచరిస్తున్నట్లు స్థానికుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాద ముద్రలు పరిశీలించిన అనంతరం పులి సంచరిస్తున్నట్లు సాలూరు రేంజ్ అటవీశాఖ అధికారులు నిర్థారించారు. పులి ఉందని అధికారులు చెప్పినప్పటి నుంచి డోకిశీల పంచాయతీ గ్రామాల గిరిజన పోడు రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎక్కడకు వెళ్లినా గుంపులు గుంపులుగానే వెళ్లాలని తెలిపారు.
నెల రోజుల క్రితం ఇదే జిల్లాలో పులి సంచారం..
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తాడిలోవ పంచాయతీ మారయ్యపాడు గిరిజన గ్రామంలో శనివారం పెద్ద పులి భయానక వాతావరణం సృష్టించింది. పులి ఆవులపైకి దాడికి దిగటంతో రెండు ఆవులు మృతిచెందాయి. పులి సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పులి తిరుగుతోందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరణించిన ఆవులను పరిశీలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రజలెవరూ ఒంటరిగా బయట తిరగవద్దని సూచించారు. శుక్రవారం రోజు మక్కువ మండలం కన్నంపేట వద్ద పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. ఆ ప్రదేశానికి 15 కి.మీ.ల దూరంలో నేడు ఈ ఘటన జరిగింది.
జనావాసాల్లో సంచరిస్తున్న పులులు..
ఏపీలోని చాలా ప్రాంతాల్లో గత కొన్నాళ్లుగా పులులు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలను పులి సమస్య వెంటాడుతోంది. గతంలో ఓసారి ఉమ్మడి విశాఖ జిల్లాల్లో రాయల్ బెంగాల్ టైగర్ సంచరించింది. చోడవరం సమీపంలోని కె.కోటపాడు రోడ్డులో సీమునపల్లి గ్రామంలో పెద్దపులి సంచారం ఒకరికి కనిపించింది. పక్కగ్రామం గుల్లిపల్లికి చెందిన కె.రమణ అనే వ్యక్తి తన బైకు మీద రాయపురాజుపేటకు వెళుతుండగా, సీమునపల్లె గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు క్రాస్ చేస్తూ కనిపించింది. దాంతో భయపడిన రమణ రాయపురాజు పేట బొడ్డేడ రామునాయుడుకు సమాచారం అందించడంతో ఆయన వెంటనే ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు ఫోన్ చేసి వివరాలు తెలిపారు.
అలెర్ట్ అయిన పోలీసులు సీమునపల్లె సహా సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. అలాగే చోడవరం సీఐ తాతారావు ,ఎస్సై విభూషణరావు, ఫారెస్ట్ అధికారులు అన్ని సమీప గ్రామాల్లోనూ మైక్ తో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేశారు. ఒంటరిగా ఎవరూ తిరగవద్దనీ, రాత్రిపూట పశువులను పాకల్లో కాకుండా.. ఇళ్లవద్దే కట్టెయ్యలంటూ సూచించారు. అలాగే పులికి సంబంధించిన ఏ వివరాలు తెలిసినా సరే వెంటనే పోలీసులకు గానీ, ఫారెస్ట్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.