టాలీవుడ్ లో విడుదల అవ్వనున్న సినిమాల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తోన్న సినిమా లలో 'హిట్ 2' ఒకటి. అడివి శేష్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సినిమా మంచి విజయం సాధించడంతో ఈ 'హిట్ 2' పై కూడా ఆసక్తి పెరిగింది. హిట్ వర్స్ అని వరుసగా 7 సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే దర్శకుడు శైలేష్ వెల్లడించారు. ఇందులో ఒక్కో సినిమాలో ఒక్కో హీరో ఉంటారని, మధ్య మధ్యలో ఆ హీరో లు కలుస్తుంటారని చెప్పడంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. 'హిట్ 2' ట్రైలర్ చూస్తే భయానకంగా కనిపిస్తుందనే చెప్పాలి. కూల్ కాప్ గా ఉండే పొలీస్ ఆఫీసర్ కృష్ణ దేవ్(అడివి శేష్) ఓ భయంకరమైన కేసు ను ఎలా ఛేదించాడనేదే ఈ సినిమా. ట్రైలర్ లో ఒక అమ్మాయిని అతి భయంకరంగా హత్య చేసి ముక్కలు ముక్కలు చేయడంతో కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. అయితే ఈ కేసును మొదట్లో హీరో చాలా సింపుల్ గా తీసుకుంటాడు. హంతకులది కోడి బుర్ర అని ఈ కేసులో హంతకుల్ని ఇట్టే పట్టుకుంటామని అంటాడు. అయితే కేసు ఎంతకీ కొలిక్కిరాదు. తర్వాత ఈ కేసులో హీరోకి ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఇస్తూ ఉంటాడు హంతకుడు. అంతేకాకుండా ఇంకో మర్డర్ కి ప్లాన్ చేస్తూ హీరోకి ఛాలెంజ్ విసురుతాడు. ఈ లోపు హత్య చేసింది ఒక్క అమ్మాయిని కాదని తెలుస్తుంది. ఆ శరీర భాగాలు ఒక్కరివే కాదని ఒక్కో పార్ట్ ఒక్కో అమ్మాయివి అని తెలియడంతో షాక్ అవుతాడు. అసలు ఆ హంతకుడు ఎవరు ? అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు ? హంతకుడ్ని హీరో పట్టుకోగలిగాడా ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా విడుదల అయ్యేదాకా ఆగాల్సిందే.
ట్రైలర్ చూస్తే 'హిట్' సినిమాకు మించి ఇందులో క్రైమ్, థ్రిల్లర్ సన్నివేశాలు ఉండనున్నట్టు కనబడుతోంది. సినిమా మొత్తం విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుంది. అలాగే మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ మెప్పించారు. ప్రస్తుతం అడివి శేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. 'మేజర్' వంటి సినిమాలతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. శైలేష్ కొలను తనదైన రీతిలో మూవీను తీశారని తెలుస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ట్రైలర్ బాగుండటంతో సినిమా పై ఉత్కంఠ నెలకొంది. ఇక హీరో నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసారి కృష్ణ మురళీ, శ్రీకాంత్ మాగంటి తదితరులు కనిపించారు. డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.