టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆయన ప్రభుత్వ బీసీ గురుకుల ప్రిన్సిపల్‌ను కాలర్ పట్టుకొని నెట్టెయ్యడాన్ని డీకే అరుణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు డీకే అరుణ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గద్వాల నియోజకవర్గంలో జరిగిన ఓ బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం విషయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరును ఆమె ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉండి ప్రభుత్వ అధికారుల పట్ల అలా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు.


జిల్లా పరిషత్ చైర్మన్ సరిత, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి రాక ముందే ప్రారంభోత్సవం చేయడంపై ఎమ్మెల్యే ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయాలని అన్నారు. తమ పార్టీ నాయకులపై ఉన్న కోపంతో ప్రభుత్వ అధికారిపై దాడి చేసి, దుర్బాషలాడాడని డీకే అరుణ అన్నారు. వారి మధ్య ఉన్న విభేదాల వల్ల ప్రభుత్వ అధికారి బలి కావాలా అని డీకే అరుణ ప్రశ్నించారు.


వారి మధ్య ఏదైనా పంచాయితీ ఉంటే పార్టీ కార్యాలయంలో లేదంటే వారి ఇళ్లల్లో చేసుకోవాలని అన్నారు. అంతేకానీ, ప్రభుత్వ అధికారిపై చేయి చేసుకుని దౌర్జన్యం ప్రదర్శించే అధికారం ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి ఇచ్చారా అని డీకే అరుణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సదరు అధికారికి ఎమ్మెల్యే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా పోలీసులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని లేదంటే బీజేపీ ఆందోళనలు చేపడుతుందని అన్నారు.


జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే ఏకంగా అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అప్పుడే ఓ బూతు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తనతో కాకుండా జడ్పీ ఛైర్మన్‌తో ఆ స్కూలును ప్రారంభం చేయించడం ఈ ఘటనకు కారణం అయింది. ఎమ్మెల్యే రావడం ఆలస్యం అయిందని నిర్వహకులు జడ్పీ ఛైర్మన్ తో స్కూలు ప్రారంభం కానిచ్చేశారు.


అసలేం జరిగిందంటే..
గద్వాలలో బీసీ గురుకుల పాఠశాలను నేడు (నవంబరు 22) ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఆయన సమయానికి రాకపోవడంతో జడ్పీ ఛైర్ పర్సన్ సరితతో ఆ పాఠశాలను ప్రారంభం చేయించారు. కార్యక్రమం అనంతరం అక్కడికి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) అవాక్కయ్యారు. ఆయన ఆగ్రహానికి గురై ఇదేంటని ప్రశ్నించారు. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందని తాను ఫోన్లు చేస్తూనే ఉన్నానని, ఇంకో అర్ధగంటలో రండి అంటూ మీరే నన్ను ఆలస్యం అయ్యేలా చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఆగ్రహం పట్టలేకపోయిన ఎమ్మెల్యే వెనకే ఉన్న విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని వెనక్కి తోసేశారు.